ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిద్రమాత్రలు మింగి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నిజాంపేట్ వర్టెక్స్ ప్రీవీలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో కల్పన నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చింది. వెంటనే అసోసియేషన్‌కు సమాచారం అందించగా, సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కల్పన స్పందించకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చారు. కల్పన భర్త చెన్నై నుంచి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె అపార్ట్‌మెంట్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు హుటాహుటిన సింగర్ కల్పనను నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కల్పన హెల్త్ కండిషన్ ప్రస్తుతం ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ సంఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. కల్పన తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో అనేక పాటలు పాడి విశేషమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.