Siva Shakthi Datta: ఆస్కార్ విజేత, టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి అయిన రచయిత శివశక్తి దత్తా సోమవారం ఉదయం కన్నుమూశారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన కళలపై ఆసక్తి ఎక్కువ. అదే ఇష్టంతో ఇంట్లో చెప్పకుండా తన చిన్న వయస్సులో ముంబయికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన సినీ ప్రయాణం వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం..
కోడూరి సుబ్బారావు కాదు.. శివశక్తి దత్తా..
రచయిత శివశక్తి దత్తా తండ్రి కోడూరి విజయ అప్పారావు (ఎం.ఎం. కీరవాణి తాత) రైతు కుటుంబమే కానీ… ఆయన బాగా చదువుకున్నవారు. అతని రెండో సంతానమే కోడూరి సుబ్బారావు మన శివశక్తి దత్తా. ఊహ వచ్చిన తర్వాత తన పేరును బాబూరావుగా మార్చుకున్నారు. 15 ఏళ్ల వయసులో శివశక్తి దత్తా చిత్రలేఖనం నేర్చుకుంటానంటే ఆయన తండ్రి వద్దు అన్నారట. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒక్కడే ముంబయికి వెళ్లిపోయారట.
అప్పట్లో అక్కడి ‘జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేరారట. రెండేళ్ళ తర్వాత డిప్లొమాతో సొంతూరు వచ్చి తన చిత్రలేఖనంతో అందర్నీ ఆకట్టుకున్నారట. ‘కమలేష్’ అనే కలం పేరుతో చిత్రాలను గీయడం ప్రారంభించిన బాబూరావు తన పేరును శివదత్తాగా పేరు మార్చుకున్నారు.
రాగం పేరునే తన కుమారుడికి పెట్టి..
రచయిత శివదత్తా కుంచెకే పరిమితమైతే తెలుగు రాష్ట్రం గర్వించే ఆర్టిస్ట్‌గా రాణించి ఉండేవారేమో కానీ… ఆయన దృష్టి దానికే పరిమితం కాలేదు. చిత్రలేఖనంతో పాటు సంగీతం పైనా తన మనసు పారేసుకున్నారు. సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. అంతే కాకుండా కథలు, కవితలంటూ సాహిత్యంలోకి అడుగుపెట్టారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎల్వీ ప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
వీణావాయిద్యం అద్భుతంగా తెలిసిన భానుమతిని పెళ్లి చేసుకున్నారు. 1961లో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఓసారి… శివదత్తా మద్రాసులో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుని కలిశారట. ‘విప్రనారాయణ’ సినిమాలో తనకి ఇష్టమైన ‘ఎందుకోయీ తోటమాలీ…’ పాట ఏ రాగంలోనిదని తెలుసుకోని.. ఆ రాగం పేరునే తన కుమారుడికి పెట్టారట. అతని కుమారుడే మన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. కీరవాణి ఆస్కార్ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు శివశక్తి దత్తా. సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని ఎంతో గర్వపడ్డారు.
తండ్రి అంటే ఎంతో ఇష్టం..
సంగీత దర్శకుడు కీరవాణికి తండ్రి శివశక్తి దత్తా అంటే ఎంతో ప్రేమ. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. శివశక్తి దత్తా.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. కీరవాణికి పట్టుబట్టి మరీ సంగీతాన్ని నేర్పించారట. తన తండ్రి వల్లే తాను ఇలా ఉన్నట్లు ఎం.ఎం. కీరవాణి అంటుంటారు.
శివశక్తి దత్తా కుటుంబం వీరే..
శివశక్తి దత్తాకి తోబుట్టువులు ఆరుగురు ఉన్నారు. ఓ అన్న, అక్క, నలుగురు తమ్ముళ్ళు. అక్కకి పెళ్ళి అవ్వడం.. అన్నయ్య కుటుంబం నుంచి వేరుపడటం వల్ల శివశక్తి దత్తే ఇంటికి పెద్ద దిక్కుగా. ఆ తమ్ముళ్లలో ఒకడు చంద్రబోస్… సంగీత దర్శకురాలు శ్రీలేఖ వాళ్ళ నాన్న. చివరి తమ్ముడు… డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.


