SN Lakshmi biography: భారతీయ సినీ రంగంలో అనేక మంది నటులు తమ ప్రతిభతో గుర్తింపు పొందారు. అందులో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పేరు ఎస్.ఎన్. లక్ష్మి. చిన్న వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి, తర్వాత వెండితెరపై అడుగుపెట్టిన ఆమె ప్రయాణం అద్భుతంగా సాగింది. వందలాది పాత్రలు పోషించి, ఆరువేలకుపైగా నాటకాలలో, వెయ్యిన్నరకి పైగా సినిమాలలో కనిపించిన లక్ష్మి, దాదాపు అన్ని ప్రముఖ హీరోలతో తెర మీద సందడి చేశారు.
13 మంది సంతానంలో..
1927లో విరుధునగర్ జిల్లాలోని అరుప్పుకోట్టై సమీప గ్రామంలో ఆమె జన్మించారు. 13 మంది సంతానంలో చిన్నదైన లక్ష్మి, చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి రాజా కంబాలతు నాయక్ ప్యాలెస్‌లో పరిపాలనా పనులు చేసేవారు. కానీ లక్ష్మి పుట్టిన కొద్ది కాలానికే ఆయన ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ సమయంలోనే తండ్రి మరణం జరగడంతో కుటుంబ పరిస్థితులు మరింత కఠినంగా మారాయి.
ఆరేళ్ల వయసులోనే ఆమె రంగస్థల జీవితం మొదలైంది. చిన్నారి వయసులోనే ఒక నాటకబృందంతో కలిసి ప్రయాణం మొదలు పెట్టి, తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడు ఆమె ఎక్కువగా వృద్ధ మహిళల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న వయసులోనే “అమ్మమ్మ” పాత్రల్లో మెప్పించిన లక్ష్మి, తర్వాత సినిమాల్లో కూడా అలాంటి రోల్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
1948లో విడుదలైన ‘చంద్రలేఖ’ చిత్రంలో ఆమెకు ఒక అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నృత్యబృందంలో భాగమై నటించారు. దాంతో ఆమె సినీప్రయాణం మొదలై, ఆ తర్వాత ఎప్పటికీ ఆగలేదు. ‘డాక్టర్ సావిత్రి’, ‘నల్ల తంగై’, ‘తమరై కులం’, ‘అవనా ఇవాన్’ వంటి అనేక చిత్రాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆర్థిక లాభాలను..
లక్ష్మి వ్యక్తిగత జీవితం చాలా ప్రత్యేకంగా సాగింది. ఆమె వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని పూర్తిగా రంగస్థలానికే, సినిమాకే అంకితం చేశారు. తన ఆర్థిక లాభాలను కూడా కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ఉపయోగపడేలా ఖర్చు చేశారు. ఆమె తన సంపాదనతో పది ఎకరాలకు పైగా తోటలు, కొన్ని ఇళ్లు దత్తతగా పెంచుకున్న కుటుంబ సభ్యులకు అందించారు. అంతేకాకుండా ఇరవైకి పైగా నిరుపేద కుటుంబాలకు గృహనిర్మాణంలో సహాయం చేశారు అని గ్రామస్తులు గుర్తుచేసుకుంటారు.
దక్షిణ భారత స్టార్ హీరోలతో..
తన సినీ కెరీర్‌లో ఆమె తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన హీరోలతో కలిసి నటించారు. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎస్.ఎస్. రాజేంద్రన్, ముత్తురామన్ వంటి దక్షిణ భారత స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకోవడం ఆమెకు సాధారణ విషయమైంది. సహజమైన నటన, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోవడం లక్ష్మి ప్రత్యేకత.
Also Read: https://teluguprabha.net/health-fitness/neem-stick-oral-care-benefits-explained/
లక్ష్మి 2012లో 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన చెన్నెల్గుడిలో జరిగాయి. అక్కడే ఆమెకు స్మారక చిహ్నం కూడా నిర్మించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఆమెను కుటుంబ సభ్యులు దేవతలా పూజిస్తారు.
సినిమా రంగంలో దశాబ్దాల పాటు శ్రమించి వందలాది పాత్రలు పోషించిన లక్ష్మి, చివరి వరకు తన కుటుంబానికే అండగా నిలిచారు. ఆమె చేసిన సేవలు, త్యాగాలు ఇప్పటికీ గ్రామ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు.


