Sr. NTR : ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు వారి గుండె చప్పుడు, నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ గారిని తలుచుకోని తెలుగు వారు ఉండరు. అయన మరణించి ఎన్నేళ్లు అవుతున్నా అయన సినిమాలు, చేసిన సేవలతో ప్రజల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. ఇప్పటికే తెలుగు ప్రజలు ఆయనని ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి.
కానీ మొట్టమొదటిసారి అమెరికాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టబోతున్నారు. ఇటీవల అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది సెటిల్ అవుతున్న సంగతి తెలిసిందే. అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అక్కడి లోకల్ నాయకులు ముందుకొచ్చారు.
అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఎడిసన్ సిటీ మేయర్ కి ప్రతిపాదించగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. దీంతో 2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అమెరికా న్యూ జెర్సీ ఎడిసన్ సిటీలో ప్రతిష్టించనున్నారు.
ఈ వార్త విని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2023లో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని స్థాపించనున్నారు. దీంతో అమెరికాలో మొట్టమొదటి ఎన్టీఆర్ విగ్రహం ఇదే అవ్వనుంది.