Mega Diwali: తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులు ఒకే వేదికపై పండుగ జరుపుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి నివాసం దీపావళి వెలుగులతో కళకళలాడింది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తమ సతీమణులు నీరజ, అమలతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సందడి చేయడం ఈ సెలబ్రేషన్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన చిరంజీవి, అనంతరం అతిథులతో కలిసి ఆనందంగా బాణసంచా కాల్చారు. చిరు, వెంకీ, నాగ్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం ఈ పండుగ వేళ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్, మరియు నా సహనటి నయనతార… మా కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఐక్యత, ప్రేమ, నవ్వులతో కూడిన క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి,” అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ అరుదైన కలయిక ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారాయి.


