Stuntman Raju: కోలీవుడ్ సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా, అనుకోని సంఘటనలో ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు (52) గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం, జూలై 14, 2025న ఉదయం ఈ విషాద వార్త వెలువడింది. ఈ విషాద ఘటన మొదట హీరో విశాల్ సినిమా షూటింగ్‌లో చోటు చేసుకుందని వార్తలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇది హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘వెట్టువన్’ చిత్రీకరణ సమయంలో జరిగింది. గత మూడు రోజులుగా నాగపట్నంలో షూటింగ్ జరుగుతోంది.
స్టంట్ మాస్టర్ రాజు, చెన్నైలోని నాగపట్నంకు సమీపంలో ఒక కారుతో సాహసోపేతమైన స్టంట్స్ నిర్వహిస్తుండగా, అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన చిత్ర బృందం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, రాజును వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించింది. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు ధృవీకరించారు. రాజు మృతితో షూటింగ్ ప్రదేశంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి, యూనిట్ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరగటం బాధాకరం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read – Salt: ఉప్పును తెగ వాడేస్తున్న భారతీయులు..
ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు ఆకస్మిక మరణం పట్ల హీరో విశాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. రాజు కుటుంబానికి ఇలాంటి క్లిష్ట సమయంలో అన్ని విధాలా అండగా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు. రాజును ఒక ధైర్యవంతుడైన, అంకితభావం కలిగిన వ్యక్తిగా విశాల్ కొనియాడారు. తాను నటించిన ఎన్నో చిత్రాలలో రాజు తన సాహసోపేతమైన, నైపుణ్యంతో కూడిన స్టంట్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని విశాల్ గుర్తు చేసుకున్నారు. కోలీవుడ్‌కు రాజు చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని విశాల్ వ్యాఖ్యానించారు.
గొప్ప స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయామని స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వ పేర్కొన్నారు. గ్రేట్ కార్ జంపింగ్ ఆర్టిస్ట్‌లో రాజు ఒకరని, ఆయన దూరం కావటం సినీ పరిశ్రమకు తీరని లోటని ఈ సందర్భంగా సిల్వ పేర్కొన్నారు.
Also Read – Teenamar Mallanna: తీన్మార్ మల్లన్న గన్‌మెన్లు సరెండర్


