Jatadhara Review: సుధీర్‌బాబు హిట్టు కొట్టి చాలా కాలమైంది. విజయం కోసం హారర్ బాట పట్టిన సుధీర్‌బాబు జటాధర సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జటాధరతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించింది. జటాధరతో సుధీర్‌బాబుకు విజయం దక్కిందా? సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?….
ఘోస్ట్ హంటర్ కథ…
శివ (సుధీర్ బాబు) ఓ ఘోస్ట్ హంటర్. దెయ్యాలు లేవన్నది అతడి సిద్ధాంతం. తన నమ్మకాన్ని రుజువు చేయాలనే ప్రయత్నంలో ఉంటాడు. అలాంటి శివకి కలలో ఎప్పుడూ ఓ పసికందు కనిపించడం, ఆ బిడ్డని ఎవరో చంపుతున్నట్టు కల రావడం జరుగుతుంది. పురావస్తు శాఖలో పనిచేసే సితార (దివ్యా ఖోస్లా) శివ ప్రేమలో పడుతుంది. రుద్రారంలో లంకెబిందల కోసం ప్రయత్నిస్తూ చాలా మంది చనిపోతుంటారు. అయితే శివ కలలో కనిపించే ఆ పిల్లాడు ఎవరు? రుద్రారంతో శివకి ఉన్న సంబంధం ఏంటి? కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని వేల కోట్ల నిధిని దోచుకోకుండా వేసిన పిశాచ బంధనం నుంచి ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఎలా బయటకు వచ్చింది? ధనపిశాచితో శివ ఎందుకు పోరాడాల్సివచ్చింది? ధన పిశాచి ఆధీనంలో ఉన్న సంపద ఎవరి సొంతమైంది? అన్నదే ఈ మూవీ కథ.
Also Read- Rashmika Mandanna: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ
మైథాలజీ ట్రెండ్…
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో మైథలాజీ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. కథ ఏదైనా దానికి భక్తి నేపథ్యాన్ని జోడించి చెబుతూ విజయాలను అందుకుంటున్నారు నేటితరం దర్శకులు. జటాధర ఈ కోవకు చెందిన సినిమానే. లంకెబిందల కాన్సెప్ట్ తో జటాధర మూవీ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. కోట్ల విలువైన సంపదను రక్షించుకునేందుకు బంధనాలు వేయడం, పిశాచి బంధనం వల్ల జరిగిన హత్యలను చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఘోస్ట్ లను నమ్మని ఘోస్ట్ హంటర్ గా హీరో పాత్రను పరిచయం చేసే వరకు సినిమా ఫాస్ట్ ఫాస్ట్‌గా సాగుతుంది. తన స్నేహితుడి మరణానికి కారణం తెలుసుకునేందుకు హీరో రుద్రారంలో అడుగుపెట్టినప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ థ్రిల్లింగ్‌ను పంచుతుంది.
హీరో కలలోకి వచ్చే ఆ పిల్లాడు ఎవరు.. ఆ కథ ఏంటి.. అనే సస్పెన్స్‌ను క్రియేట్ చేసి సెకండాఫ్ కోసం ఎదురుచూసేలా చేశారు దర్శకద్వయం. సుధీర్‌బాబు, దివ్యా ఖోస్లా లవ్ ట్రాక్ రొటీన్‌గా ఉంది. దయ్యాలు లేవని హీరో నిరూపించే సీన్లలో ఆసక్తి లోపించింది. మరి సినిమాటిక్‌గా ఆ సీన్లు సాగుతాయి. సెకండాఫ్ లో జటాధర కథ రివీల్ అవుతుంది. ధన పిశాచి ఆవిర్భావం, దాని రక్త దాహం, అది కోరుకున్న బలి గురించి చూపించారు. శివ గతం, అతని తల్లిదండ్రులు, వారికి వచ్చిన కష్టాలను ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు డైరెక్టర్.
థ్రిల్ మిస్…
ధనపిశాచి నేపథ్యంలో వచ్చే సీన్లు ఏ మాత్రం భయపెట్టలేకపోయాయి. హీరోకు ధన పిశాచికి మధ్య పోరాటంలో థ్రిల్ మిస్సయ్యింది. హీరో ష్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సోసోగానే ఉంది. దుష్టశక్తిని అంతం చేయడానికి దేవుడు దిగిరావడం అనే పాయింట్‌ను మిరాయ్, హనుమాన్, కాంతారతో పాటు చాలా సినిమాల్లో డైరెక్టర్లు పవర్‌ఫుల్‌గా చూపించారు. ఆయా సినిమాల విజయంలో భక్తి పాయింట్ కూడా కీలకంగా నిలిచింది. జటాధరలో డైరెక్టర్లు ఇదే రూట్‌ను ఫాలో అయ్యారు. శివుడి నేపథ్యంలో సాగే క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది. జటాధరకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
Also Read- Peddi: క్రికెట్ బ్యాట్ తో చరణ్ మాస్ స్టెప్స్! మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!
హారర్ ఇష్టపడే ఆడియెన్స్ కోసం…
ఘోస్ట్ హంటర్ పాత్రలో సుధీర్‌బాబు నటన బాగుంది. ఎక్కడ ఓవర్ ది బోర్డ్ కాకుండా సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సిక్స్‌ప్యాక్‌లో కనిపించాడు. పాత్రకు ఏం కావాలో అవన్నీ చేశాడు. నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోదర్కర్ కనిపించారు. వారి నటన ఓకే అనిపిస్తుంది. హీరోయిన్‌గా దివ్యా ఖోస్లా పాత్రకు అంతగా ప్రాధాన్యతలేదు. శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాలతో పాటు పలువురు సీనియర్ యాక్టర్లు తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని బాగున్నాయి. బీజీఎమ్ కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేసింది. హారర్, మైథాలజీ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను జటాధర కొంత వరకు మెప్పిస్తుంది.


