Best Malayalam Horror Comedy Movies on OTT: మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. భిన్నమైన కథలు, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో అన్ని భాషల వారు ఈ సినిమాలను తెగ చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక మలయాళం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా మలయాళ నటుడు అర్జున్ అశోకన్ నటించిన కొత్త చిత్రం ‘సుమతి వలవు’ ఈ శుక్రవారం (ఆగస్టు 1) థియేటర్లలోకి రానుంది. ఈ హారర్ కామెడీ కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సుమతి వలవు గురించి ఒక భయంకరమైన జానపద కథ ఆధారంగా రూపొందింది. కాబట్టి ఈ చిత్రం చూసే ముందు కొన్ని సూపర్ హిట్ టాప్ మలయాళ హారర్ కామెడీ చిత్రాల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
ప్రేతమ్ (సన్ నెక్ట్స్) – ఒక చిన్న రిసార్ట్‌ను ప్రారంభించిన ముగ్గురు స్నేహితుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నది కథ. ఆ రిసార్ట్ లో జరిగే అనూహ్యమైన సంఘటనలు.. థ్రిల్లింగ్ మిస్టరీగా సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. అజు వర్గీస్, షరఫ్ యు దీన్ ప్రదర్శన సినిమాకు బలంగా నిలిచింది.
ఒరు మురై వంతు పార్తాయ (జీ5 ఓటీటీ) – ప్రకాశన్ అనే ఓ స్థానిక మల్లయోధుడు.. తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించిన ఓ అమ్మాయితో (పార్వతి) ప్రేమలో పడతాడు. ఆమెను తన ఇంట్లో తాత్కాలికంగా ఉండటానికి అతడు ఆశ్రయం ఇచ్చిన తర్వాత… వీరిద్దరి ప్రేమ కథ మొదలవుతుంది. కానీ ఆ తర్వాత ప్రకాశన్.. పార్వతి ఓ మనిషి కాదని తెలుసుకుంటాడు. అనంతరం జరిగే సంఘటనలు ప్రేక్షకులకు భయంతోపాటు నవ్వులు కూడా పూయిస్తాయి.
రోమాంచం (జియోహాట్‌స్టార్) – సాధారణంగా ఉల్లాసంగా సాగిపోయే ఏడుగురు రూమ్‌మేట్ల జీవితం.. ఊయీజా బోర్డు ఆట వల్ల ఎలాంటి భయానక సంఘటనలను ఎదుర్కొన్నారన్నది కథ. ఈ చిత్రం మలయాళంలో వచ్చిన బెస్ట్ హారర్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలిచింది. సౌబిన్ షాహిర్, సిజు సన్నీ, సాజిన్ గోపు, అర్జున్ అశోకన్ సహా పలువురు నటించారు. బెంగళూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ రోమాంచం మూవీ రూపొందింది.
మాంత్రికన్ (సన్ నెక్ట్స్) – ఓ మంత్రవేత్త కుమారుడు తన తండ్రి విద్యల పట్ల విరక్తితో, సాధారణ జీవితాన్ని కోరుకుంటాడు. కానీ, అతడు ఓ అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత అతడి చుట్టూ మళ్లీ మాయ, మంత్రాల ప్రపంచం తిరుగుతుంటుంది. హాస్యం, హారర్ కలగలిపిన ఈ కథలో మాంత్రిక శక్తులు.. జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఆసక్తికరంగా చూపించారు.
పాకలప్పురం (సన్ నెక్ట్స్) – ఈ కథకు నేపథ్యం సూర్యమంగళం. ఒకప్పుడు బ్రహ్మదత్తన్ నంబూదిరి అక్కడ ఒక దుష్ట దెయ్యంతో పోరాడుతాడు. ఆ దెయ్యం అతని కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతిజ్ఞ చేస్తుంది. కొన్నేళ్ల తర్వాత బ్రహ్మదత్తన్ చిన్న కొడుకు గౌరీదాసన్ ఆ దెయ్యాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ సినిమా కథ. కాగా, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ చిత్రాలను కేవలం ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తోనే చూసేయొచ్చు.


