Himalayas: సూపర్‌స్టార్ రజనీకాంత్… ఈ పేరు పక్కన ‘సింప్లిసిటీ’ అనే పదం లేకపోతే, ఆయన జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. స్టార్‌డమ్ శిఖరాన ఉన్నా, నేల మీదే నడుస్తున్న అరుదైన వ్యక్తిత్వం కేవలం తలైవా సొంతం. ఆయన అనుకువ, మర్యాద.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న హీరోల్లో కూడా ఆశించలేనిది.
ప్రస్తుతం తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కూలీ’ (Coolie) విజయాన్ని ఆస్వాదిస్తున్న రజనీకాంత్, ఆ వెంటనే ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీ కానున్నారు. ఈ బిజీ షెడ్యూల్స్ మధ్య కాస్త విరామం తీసుకుని, ఆయన తన ఆరాధ్య దైవం, గురువు మహా అవతార్ బాబాజీని దర్శించుకోవడానికి హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు.
బాబాజీ గుహలో లోతైన ధ్యానం
రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పర్యటనలో ఆయన రిషికేశ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించారు. ఆ తర్వాత ఆయన మహా అవతార్ బాబాజీ గుహకు వెళ్లి అక్కడ లోతైన ధ్యానంలో మునిగిపోయారు.
వైరల్ అవుతున్న ఒక ఫొటోలో, రజనీకాంత్ సాంప్రదాయ తెల్లటి దుస్తులు ధరించి, కళ్లు మూసుకుని, మహా అవతార్ బాబాజీ గుహ లోపల ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనిపించారు. మరొక ఫోటోలో, ఆయన చేతిలో కర్ర పట్టుకుని, మెట్లపై సాధారణంగా కూర్చుని ఉండటం కనిపిస్తుంది.
కేవలం ధ్యానం మాత్రమే కాదు, ఈ యాత్రలో రజనీకాంత్ స్వామీజీలతో కలిసి సాధారణ భోజనం కూడా చేశారు. రజనీ టీమ్ ఈ యాత్రకు సంబంధించిన ఒక వీడియోను X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేస్తూ, హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ బాబాజీ గుహ సమీపంలోని శ్రీ బాబాజీ ఆశ్రమంలో స్వామీజీతో కలిసి దివ్య భోజనం చేశారని రాశారు. ఈ సింప్లిసిటీ, ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆయన ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఎంతో ముగ్ధులవుతున్నారు.
ఇటీవల, రజనీకాంత్ రోడ్డు పక్కన ఆగి, ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తూ కనిపించిన ఫొటోలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి. తన వ్యక్తిగత జీవితంలో స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి, సామాన్య భక్తుడిలా ఆధ్యాత్మిక యాత్ర చేయడం ఆయన గొప్పదనాన్ని చాటి చెబుతోంది.
భారీ ప్రాజెక్టులతో తలైవా బిజీ
ఆధ్యాత్మిక యాత్ర ముగిసిన వెంటనే రజనీకాంత్ తిరిగి షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘జైలర్ 2’ తో పాటు, ‘మహారాజ’ దర్శకుడితో ఒక సినిమా, అలాగే, కమల్ హాసన్ నిర్మాణంలో మరొక సినిమా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


