Jailer 2 Release Date: సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’ కోసం అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. దీన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తోంది. జైలర్ సాధించిన సక్సెస్‌తో సీక్వెల్‌పై ఇప్పటికే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీనిపై తలైవర్ ఇచ్చిన లీక్డ్ అప్‌డేట్ మాత్రం నెట్టంట చక్కర్లు కొడుతోంది.
కేరళలో తాజాగా ‘జైలర్ 2’కు (Jailer 2) సంబంధించిన షెడ్యూల్ పూర్తయ్యింది. అక్కడి నుంచి చెన్నై చేరుకున్న రజినీకాంత్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో సినిమాను వచ్చే ఏడాది జూన్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంతో ప్రెస్టీజియస్ మూవీగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ విషయంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాన్ని రజినీకాంత్ చెప్పేయటం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎప్పుడో చిత్రీకరణను స్టార్ట్ చేసుకున్న ‘జైలర్ 2’ రిలీజ్‌కు అంత ఆలస్యమెందుకు కానుందనేది ఎవరికీ అంతు పట్టని విషయంగా ఉంది. జైలర్ మూవీ రజినీకాంత్ స్టార్ డమ్‌కు ఊపిరి పోసిందనే చెప్పాలి. సూపర్‌స్టార్‌కి హిట్ మూవీ కంపల్సరీ అని అందరూ అనుకుంటోన్న సమయంలో జైలర్ మూవీ రూ.600 కోట్లను కొల్లగొట్టింది.
రజినీకాంత్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), కన్నడ కరుణడ చక్రవర్తి శివ రాజ్ కుమార్(Shiva Rajkumar) అతిథి పాత్రలు, అనిరుధ్ సంగీతం సినిమా సక్సెస్‌లో ఎంతో కీలకంగా మారాయి. అదే పంథాలో ఇప్పుడు నెల్సన్ ‘జైలర్ 2’ను రూపొందిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈసారి నందమూరి బాలకృష్ణ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోసారి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
‘జైలర్ 2’పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నప్పటికీ రీసెంట్‌గా వచ్చిన కూలీ (Coolie) సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటం ట్రేడ్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. కూలీ విషయానికి వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆరు వందల కోట్లు కావాల్సిన సమయంలో రూ.500 కోట్లు పైచిలుకు వసూళ్లతో సినిమా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆ ప్రభావం ‘జైలర్ 2’పై ఎలా ఉండబోతుందో చూడాలి.


