Supreme Court On Kamal Haasan Kannada Issue: తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’(Thug Life) చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ 5న విడుదలైన ఈ చిత్రం కర్ణాటకలో మాత్రం రిలీజ్ కాలేదు. తాజాగా ఈ సినిమాను కర్ణాటకలో కూడా రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విడుదలకు అనుమతి ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వానికి ఓరోజు గడువు ఇచ్చింది. అలాగే ఈ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేయాలని బెదిరించిన సంఘాలను కూడా హెచ్చరించింది.
సెన్సార్ బోర్డు అనుమతి పొందిన చిత్రం ఏ రాష్ట్రంలోనైనా విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక కమల్ హాసన్ ను క్షమాపణలు చెప్పమనే హక్కు కర్ణాటక హైకోర్టుకు ఎక్కదని మండిపడింది. అయితే కమల్ వ్యాఖ్యలు కన్నడ ప్రజలకు తప్పు అనిపిస్తే ఓ ప్రకటన విడుదల చేయాలని సూచించింది. అంతేకానీ ఇలా సినిమాలు అడ్డుకుంటామని బెదిరించడం సరికాదని పేర్కొంది. అనంతరం ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది
‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళ భాష తల్లి వంటిదని వ్యాఖ్యానించారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ వ్యాఖ్యలపై పలు కన్నడ సంఘాలు కర్ణాటకలో మూవీ విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి. దీంతో సినిమా విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలంటూ కర్ణాటక హైకోర్టులో కమల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించింది. అయితే కమల్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మూవీ విడుదలకు ఆటంకం తొలగిపోయింది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం-కమల్ కాంబోలో 37 ఏళ్ల తర్వాత తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజం చవిచూసింది. మణిరత్నం మార్క్ మిస్ కావడం, రొటిన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. దీంతో వసూళ్లు కూడా భారీగా పడిపోయాయి.
Thug Life: సుప్రీంకోర్టులో కమల్ హాసన్ కు భారీ ఊరట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES