ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కు సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో సురేష్ ప్రొడక్షన్స్‌కు ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూముల్ని ఇతర అవసరాలకు కూడా వాడుకునేందుకు అనుమతిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసి భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులను సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరమైతే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోర్టుకు తెలిపింది.