Tanushree Dutta Video: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనేక మంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ వంటి వేధింపులు ఎదుర్కొన్నా.. అవకాశాలు కోల్పోతామనో, తమకు హాని జరుగుతుందనో భయపడి ఎవరూ బయటపడలేకపోయారు. కానీ.. తనుశ్రీ దత్తా ఎవరికీ భయపడకుండా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడారు.
ముంబై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో నటుడు నానా పటేకర్, గణేష్ ఆచార్య, రాకేష్ సారంగ్, అబ్దుల్ సమీ, అబ్దుల్ గని, సిద్ధిఖీలపై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల కేసు పెట్టారు. సెట్‌లో తనను లైంగికంగా వేధించారని, అసభ్యంగా తాకారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె బయటపడిన తర్వాతే చాలా మంది ధైర్యంగా తమ అనుభవాలను పంచుకోవడం మొదలుపెట్టారు. మీటూ కేసు తర్వాత తనుశ్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆమెపై ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు కూడా జరిగాయని, చాలా మంది తనను వేధిస్తున్నారని గతంలో ఆమె చెప్పారు.
Also Read – Suriya First Salary: హీరో సూర్య కళ్లు చెదిరే ఆస్తులు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం 736 రూపాయలే!
ఎన్నో సందర్భాల్లో ధైర్యంగా నిలబడిన తనుశ్రీ దత్తా తాజాగా మాత్రం ధైర్యం కోల్పోయి కనిపించారు. తన ఇంట్లో వారే తనను వేధిస్తున్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘కొన్నేళ్లుగా నా ఇంట్లో వాళ్లే నన్ను వేధిస్తున్నారు. పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వమన్నారు. మరో రెండు రోజుల్లో నేను స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాను. గత నాలుగైదేళ్లుగా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. నా ఇల్లు నాకు నాదిలా అనిపించడం లేదు. అంతా చిందరవందరగా మారిపోయింది. పనివాళ్లను పెట్టుకుంటే వారు కూడా నన్ను మోసం చేస్తున్నారు, ఏది దొరికితే అది దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘గత రెండు సంవత్సరాలుగా మా ఇంటివద్ద పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి. ఈ సౌండ్స్ గురించి భవన నిర్వహణ అధికారులకు చెప్పి చెప్పి విసిగిపోయాను. ఆ శబ్దాలు నన్ను చాలా వేధిస్తున్నాయి. రోజంతా ఇలానే జరుగుతుంది. దీనివలన నేను అనారోగ్యానికి గురయ్యాను. విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంటి తలుపు కొడుతూ విసిగిస్తున్నారు. డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పినా కూడా బెల్ మోగించడం ఆపడం లేదు’ అంటూ తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ధైర్యానికి మారుపేరుగా నిలిచిన తనుశ్రీ దత్తా, ఇప్పుడు నిస్సహాయ స్థితిలో సహాయం కోరుతూ చేసిన ఈ విజ్ఞప్తి అందరినీ కదిలిస్తోంది.
Also Read – Vice President Election : ఈసీ ఆధ్వర్యంలో… ఉభయసభల్లో ఎవరికెంత బలం?


