Tollywood and Kollywood: పాన్ ఇండియన్ కల్చర్‌తో టాలీవుడ్, కోలీవుడ్ అనే హద్దులు మెళ్లమెళ్లగా తొలగిపోతున్నాయి. తమిళం, మలయాళ హీరోల సినిమాలు సైతం టాలీవుడ్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇతర భాషలకు చెందిన కథానాయకులకు తెలుగులో ఫాలోయింగ్ పెరుగుతోంది. మలయాళ, తమిళ హీరోల కోసం టాలీవుడ్ డైరెక్టర్లు కథలు సిద్ధం చేయడమే కాకుండా వారితో సినిమాలు చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్లు, తమిళ హీరోల కాంబినేషన్స్‌లో వస్తోన్న కొన్ని సినిమాలు ఏవంటే?
సూర్య – వెంకీ అట్లూరి మూవీ…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాడు. రామ్‌గోపాల్ వర్మ రక్త చరిత్ర 2తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. ఆ తర్వాత తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసే ఆఫర్లు చాలానే వచ్చినా కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత వెంకీ అట్లూరి మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు సూర్య. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఆఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో సూర్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read – Bomb threat: గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు.. ఆందోళనలో అధికారులు..!
విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్…
ఒకప్పుడు తెలుగులో పూరి జాగన్నాథ్‌తో సినిమా చేసే అవకాశం కోసం టాలీవుడ్ స్టార్స్ ఎదురుచూసేవారు. వరుస పరాజయాల కారణంగా ప్రస్తుతం పూరితో సినిమా అంటేనే ముఖంచాటేస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్‌తో పూరి జగన్నాథ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్‌తో పాటు టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి మూవీతోనైనా పూరి జగన్నాథ్ విజయాల బాట పడతాడో లేదో చూడాల్సిందే.
ఘాటితో టాలీవుడ్ ఎంట్రీ…
అనుష్క హీరోయిన్‌గా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఘాటి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుష్కకు జోడీగా తమిళ హీరో విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతోనే విక్రమ్ ప్రభు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Pakistan: పాక్ వక్రబుద్ధి.. వారి రక్షణ కోసం చట్ట సవరణ
కుబేర వంద కోట్లు…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కుబేర సక్సెస్‌తో కోలీవుడ్ హీరోలు శివకార్తీకేయన్, కార్తీ కోసం తెలుగులో కథలు సిద్ధం అవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.


