తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ (వరుణ్), రాశీ ఖన్నా (అంజలి), శ్రీనిధి శెట్టి (రాగ), వైవా హర్ష (అభి), అన్నపూర్ణ, సంజయ్ స్వరూప్, రోహిణి, శివన్నారాయణ, రాజశ్రీ నాయర్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
రచన-దర్శకత్వం: నీరజ కోన
రేటింగ్: 3/5
ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనేసరికి ముక్కోణ ప్రేమకథాచిత్రం లేదా, హీరో జీవితంలోకి ఒక హీరోయిన్ తర్వాత ఇంకో హీరోయిన్ వస్తుంది అని సాధారణంగా భావిస్తారు. ఆ ఊహలకు భిన్నమైన కాన్సెప్టుతో నీరజ కోన డైరెక్ట్ చేసిన సినిమా ‘తెలుసు కదా’.
కథ
వరుణ్ చిన్నతనంలోనే తల్లితండ్రుల్ని కోల్పోయిన అనాథ. స్వయంకృషితో సొంతంగా రెస్టారెంట్ నడిపే స్థాయికి ఎదుగుతాడు. పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, ఒక చక్కని కుటుంబంతో జీవితాన్ని ఆస్వాదించాలనుకొనే అబ్బాయి. మొదట రాగ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు రిలేషన్‌షిప్ ఇష్టమే కానీ, పెళ్లి, పిల్లలు అంటే గిట్టక వరుణ్‌ను దూరమవుతుంది. గుండె బద్దలైన వరుణ్‌కు కొంత కాలం తర్వాత స్నేహితుడు అభి సముదాయించి, నలుగురు అమ్మాయిల సంబంధాలు తీసుకువస్తాడు. వారిలో అంజలి అనే అమ్మాయి వరుణ్‌కు బాగా నచ్చేస్తుంది. ఇద్దరి అభిరుచులూ ఒకే రకమైనవి అని తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటారు. కానీ అంజలికి పిల్లలు పుట్టరనే భయంకర నిజం బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాల్లోకి మళ్లీ రాగ ఎందుకు వచ్చింది? ఈ ముగ్గురి కథ ఏ తీరానికి చేరిందనేది మిగతా సినిమాలో చూస్తాం.
కథనం-దర్శకత్వం
ఇంతవరకూ కాస్ట్యూం డిజైనర్‌గా అందరికీ తెలిసిన నీరజ కోన దర్శకురాలిగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘తెలుసు కదా’. ఒకప్పటి ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ కాలంలో నవలలు రాస్తే బహుశా వాటిలో ‘తెలుసు కదా’ లాంటి ఒక కథ కూడా ఉంటుందేమో. అంజలికి పిల్లలుపుట్టే అవకాశం లేదని మెడికల్‌గా స్పష్టమయ్యాక వరుణ్, అంజలి గురయ్యే భావోద్వేగాలను దర్శకురాలు ప్రతిభావంతంగా తెరకెక్కించారు. మూడు ముఖ్య పాత్రలూ సంఘర్షణాభరితమైనవి కావడంతో కథలో కావాల్సినంత డ్రామాకు చోటు లభించింది. అయితే ఆ డ్రామాను అర్థం చేసుకొనేవాళ్లు ఎంతమంది ఉంటారని! సమాజంలోని ఆధునిక పోకడలకు అద్దంపట్టే రాగ లాంటి పాత్రతో ఎంతమంది కనెక్ట్ కాగలుగుతారనేది పెద్ద ప్రశ్న. పైగా ఆమె క్యారెక్టర్ డిజైన్‌లో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఒకవైపు పెళ్లి, పిల్లలు వద్దు, ఇలాగే కలిసి తిరుగుతాం అనే మనస్తత్వం కలిగిన రాగ, మరోవైపు తన స్నేహితులకు వరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా పరిచయం చేయడానికి భయపడటం, ఏమిటో పాలుపోదు. అంజలి పాత్రలో ఇలాంటి వైరుధ్యం కనిపించదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో డ్రామా, పాత్రల మధ్య సంభాషణలు సుదీర్ఘంగా నడవడం కథనంలో ‘పరుగు’ను ఇష్టపడేవాళ్లకు రుచించదు. సరోగసీ అంశాన్ని కథలో వాడుకున్న తీరు మాత్రం దర్శకురాలి పరిణతికి నిదర్శనం. సీమంతం సీన్ అనేది సంప్రదాయ ప్రేక్షకుల్ని ఉద్దేశించి పెట్టినట్లు అనిపిస్తుంది.
నటీనటుల అభినయం
వరుణ్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనకు అలవాటైన ధోరణిలో రాణించాడు. నిజానికి ఈ క్యారెక్టర్ ఇటీవలి కాలంలో మనం చూసిన అతని బాడీ లాంగ్వేజ్‌కి అతకనిది. అయినా తనదైన శైలిలోనే ఆ పాత్రను రక్తి కట్టించాడు. హావభావాలు, సంభాషణలను పలికే తీరు, పాత్రలోని సంఘర్షణను ప్రదర్శించిన విధానం.. నటునిగా సిద్ధు ఇదివరకటికన్నా మెరుగయ్యాడని నిరూపిస్తాయి. అంజలి పాత్రను రాశీ ఖన్నా చాలా సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేసింది. ఇంతవరకు ఆమెను మన దర్శకులు సరిగా వినియోగించుకోలేకపోయరని చెప్పవచ్చు. అలాంటి నటనను ఆమె చూపించింది. రాగ పాత్రలో శ్రీనిధి ఆకట్టుకుంది. రెండు కోణాలున్న పాత్రలో ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. వరుణ్ ఫ్రెండ్ అభిగా వైవా హర్ష కథకు ఉపయోగపడే పాత్రను తన శైలిలో చేశాడు.
సాంకేతిక అంశాలు
స్క్రీన్‌ప్లే బాగానే కుదిరినప్పటికీ, రాగ పాత్ర చిత్రణ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. అక్కడక్కడ సంభాషణల్లో చమక్కులున్నాయి. కానీ పలుచోట్ల సుదీర్ఘమైన సంభాషణలు కథ నెమ్మదిగా నడుస్తుందనే ఫీలింగ్‌నిస్తాయి. మానసిక సంఘర్షణతో కూడిన సన్నివేశాలకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయ్యింది. పాటలు సంగీతపరంగా, చిత్రీకరణపరంగా బాగున్నాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్‌ను తీసుకొచ్చింది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగుప్రభ వర్డిక్ట్
కథాంశం, పాత్రల మధ్య సంఘర్షణ, దర్శకత్వ ప్రతిభ, నటీనటుల పనితీరు, సాంకేతికంగా నాణ్యత వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా ఏ సెంటర్ల ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే అవకాశాలున్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం కష్టం.
– బుద్ధి యజ్ఞమూర్తి


