Film Workers Strike: వేతనపెంపు కావాలంటూ సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చేస్తున్న సమ్మె ముగిసింది. శుక్రవారం నుంచి యదావిధిగా షూటింగ్స్ మొదలవుతాయి. గత 18 రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అనిశ్చితి నెలకొంది. అందుకు కారణం..షూటింగ్స్ ఆగిపోవటమే. వేతన పెంపు కోరుతూ సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నోటీసులిచ్చింది. దీనికి నిర్మాతలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవటంతో వారు సమ్మె మొదలుపెట్టారు. ఇటు నిర్మాతలు, అటు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించటానికి ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తూనే వచ్చింది. పలుమార్లు రెండు వర్గాలతోనూ మాట్లాడింది. చర్చలు దాదాపు సఫలమయ్యాయని అనుకునే తరుణానికి ఏదో ఒక సమస్య అడ్డుపడుతూనే వచ్చింది. చివరకి నిర్మాతలు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు నాలుగు కండీషన్స్ సూచించారు.
1. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ (ఇప్పుడు కాల్ షీట్ టైమింగ్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంది.. దీన్ని నిర్మాత వీలును అనుసరించి ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు చేయటం)
2. సెకండ్ సండే, గవర్నమెంట్ హాలీడేస్‌లో వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ ఉంటుంది.. మిగిలిన ఆదివారాలు, సెలవు రోజుల్లో సాధారణ వేతనమే ఉంటుంది
3. యూనియన్స్‌తో సంబంధం లేకుండా స్కిల్ ఉన్న ఏ టెక్నీషియన్స్‌తో అయినా నిర్మాత వర్క్ చేయించుకోవచ్చు
4. రేషియో పద్ధతి నిర్మాతను అనుసరించే ఉంటుంది
పైన సూచించిన కండీషన్స్‌కు ఒప్పుకుంటే తాము కూడా వేతన సవరణకు ఒప్పుకుంటామని పేర్కొన్నారు. వీటిలో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ మినహా మిగిలిన మూడు కండీషన్స్‌కు ఫెడరేషన్ ఓకే అనే చెప్పింది. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్‌పై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ తగ్గలేదు. దీంతో సమ్మె కొనసాగుతూ వచ్చింది. సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు రంగంలోకి దిగినప్పటికీ, సమస్య కొలిక్కి రాలేదు.
చివరకు పంచాయతీ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. వెంటనే ఆయన సమ్మె సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వారు రంగంలోకి దిగటంతో పరిస్థితులు మారాయి. లేబర్ కమీషన్‌తో ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతలు చర్చలు జరిపారు. చర్చలు ఫలితంగా చూస్తే.. 3 సంవత్సరాలకు కలిపి 22.5 శాతం వేతన పెంపు చేస్తామని నిర్మాతలు తెలిపారు. రూ.2 వేలు లోపు తీసుకుంటున్న కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతన పెంపు ఉంటుంది. రూ.2 నుంచి 5 వేలు తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతన పెంపు ఉంటుంది. మిగిలిన సమస్యలు పరిష్కరించటానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తారు.. దీనికి నెల రోజుల సమయం పడుతుంది. పెద్ద సినిమాలకు ప్రతీ సండే ఒకటిన్నర కాల్ షీట్ ఉంటుంది..చిన్న సినిమాలకు రెండు, నాలుగో సండే మాత్రమే ఒకటిన్నర కాల్ షీట్ ఉంటుంది.


