November Movies: టాలీవుడ్‌కు సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసివచ్చాయి. సెప్టెంబర్‌లో రిలీజైన నాలుగు సినిమాలు హిట్టవ్వగా.. అక్టోబర్‌లో కే ర్యాంప్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నవంబర్‌లో ఆ సక్సెస్ జోష్ కంటిన్యూ అవుతుందా? లేదా? అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నవంబర్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
ది గర్ల్‌ఫ్రెండ్ బోణీ కొడుతుందా?
నవంబర్‌లో రిలీజ్ అవుతోన్న సినిమాల్లో ది గర్ల్‌ఫ్రెండ్‌పైనే ఎక్కువగా హైప్ ఉంది. రష్మిక మందన్న నటిస్తున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. రాహుల్ రవీంద్రన్ దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ది గర్ల్‌ఫ్రెండ్‌తో నవంబర్ నెలలో రష్మిక సక్సెస్ బోణీ కొడుతుందా? లేదా? అన్నది మరో ఐదు రోజుల్లో తేలనుంది. ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీలో దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 7న గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు సుధీర్ బాబు జటాధర థియేటర్లలోకి రాబోతుంది. ఫాంటసీ హారర్‌గా రూపొందుతున్న ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హిట్టు అందుకొని చాలా కాలమైంది. జటాధర రిజల్ట్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. తీరువీర్ ప్రీ వెడ్డింగ్ షోతో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఆర్యన్ ఈ వారమే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
దుల్కర్ సల్మాన్ కాంత
సీతారామం, లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ సల్మాన్ చేసిన తెలుగు మూవీ కాంత నవంబర్ 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మించారు. కాంతతో పాటు విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు అదే రోజు థియేటర్లలోకి రాబోతుంది.
మూడు సినిమాలు…
నవంబర్ మూడో వారంలో మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. పూర్తిస్థాయి హారర్ కథాంశంతో ఫస్ట్ టైమ్ అల్లరి నరేష్ చేస్తున్న 12ఏ రైల్వే కాలనీ మూవీ నవంబర్ 21న థియేటర్లలోకి వస్తుంది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో నాని కాసరగడ్డ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ 12 ఏ రైల్వే కాలనీ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. హారర్ స్టోరీ అల్లరి నరేష్‌కు సక్సెస్ అందిస్తుందో లేదో అన్నది చూడాల్సిందే. నవంబర్ 21న రైల్వే కాలనీతో పాటు నందు, అవికాగోర్ అగ్లీ స్టోరీతో పాటు విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి విడుదలకానున్నాయి.
ఆంధ్రా కింగ్ తాలూకాతో నవంబర్ నెలాఖరున ప్రేక్షకులను పలకరించబోతున్నాడు రామ్ పోతినేని. నవంబర్‌లో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ హిట్టు అందుకొని చాలా ఏళ్లు అవుతుంది. ఆంధ్రా కింగ్ తాలూకా రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడ ఖాయమని అభిమానులు భావిస్తోన్నారు.


