నటసింహం బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పించాయి. సరికొత్త అవతారంలో బాలయ్య కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రూ.150కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలయ్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో వరుసగా నాలుగు రూ.100కోట్ల మూవీలు రాబట్టిన సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. అంతకుముందు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి పాటల వీడియోలను మేకర్స్ విడుదల చేయగా.. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘ది రేజ్ ఆఫ్ డాకు’ అంటూ సాగే ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో థమన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితం అవుతుండగా.. ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.