The Raja Saab Controversy: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం పెద్ద చిక్కులో పడింది. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో ఏకంగా ₹218 కోట్ల మోసం ఆరోపణలతో ఒక పిటిషన్ దాఖలైంది. సినిమా విడుదలకు ఆలస్యమవుతున్న తరుణంలో ఈ కేసు రావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకెళ్తే.. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్’ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, మాళవిక మోహనన్ అనే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అంతేకాకుండా, సంజయ్ దత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పలు వాయిదాల తర్వాత ది రాజా సాబ్ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించి అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే, వీఎఫ్‌ఎక్స్ పనులు, ఇతర కారణాల వల్ల విడుదల తేదీని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీ రిలీజయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమా మళ్లీ వాయిదా పడుతుందని అభిమానులు బాధపడుతున్న తరుణంలో మరో విషయం అందరినీ కంగారు పెడుతుంది. విషయమేమంటే.. ఢిల్లీకి చెందిన ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ది రాజా సాబ్ మూవీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bollywood-romantic-movie-saiyaara-ott-date-locked/
ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం ది రాజాసాబ్ కోసం సదరు సంస్థ ఏకంగా రూ. 218 కోట్లు పెట్టుబడిగా పెట్టామని పేర్కొంది. ఈ పెట్టుబడికి బదులుగా సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇచ్చేలా మేకర్స్ అగ్రిమెంట్ చేశారు. అలాగే సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా సింగిల్ రిలీజ్ వచ్చేలా చూసుకుంటామని కూడా నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదని, సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు కూడా లేవని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆరోపించింది. నిర్మాతలు అనుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని, సినిమా విడుదలను వాయిదా వేశారని సంస్థ ఫిర్యాదు చేసింది.
ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తమ పెట్టుబడి కోసం అప్పులు చేశామని, ప్రస్తుతం వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని కోర్టుకు తెలిపింది. అందుకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తమకు 18% వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఆ మొత్తం చెల్లించే వరకు ‘ది రాజాసాబ్’ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎలాంటి హక్కులు ఉండకూడదని, సినిమా టైటిల్‌ను కూడా దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని ఆ పిటిషన్‌లో కోరింది.మరి దీనిపై ఢిల్లీ హైకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మరో వైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దీనికి ఎలా స్పందిస్తారనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


