Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు క‌న్నుమూత‌

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు క‌న్నుమూత‌

Kota Srinivasa Rao Passed away: తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు(83) క‌న్నుమూశారు. వ‌య‌సు రీత్యా కొన్ని రోజులుగా అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆదివారం తెల్ల‌వారు జామున ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. 40 సంవ‌త్స‌రాల‌ సినీ ప్ర‌యాణంలో 750కు పైగా చిత్రాల్లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. 1999-2004 వ‌ర‌కు విజ‌యాడ తూర్పు ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఈయ‌న భార్య‌, కొడుకు, ఇద్ద‌రు కుమార్తెలు. అయితే కొన్నేళ్ల ముందే కొడుకు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

- Advertisement -

1978లో విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి నటుడిగా ప్రవేశించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. తెలుగు సినిమా పరిశ్రమ పరభాషా నటులకు కాకుండా తెలుగు నటీనటులకే అవకాశం ఇవ్వాలని గట్టిగా  పోరాటం చేసిన వారిలో కోట ఒకరు. కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబో కామెడీకి ప్రత్యేకమైన అభిమానులున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు.

డాక్టర్ కావాలనుకున్న ఆయన తర్వాత బ్యాంకు ఉద్యోగిగా మారారు. రంగస్థల నటుడిగా అనుభవం ఉండటంతో వీలున్నప్పుడల్లా నాటకాలు వేస్తుండేవారు. అలా క్రమంగా సినీ రంగం వైపుకు అడుగులు వేశారు. సినిమాల్లో బిజీగా మారగానే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ప్రతిఘటన. టి.కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కోట డైలాగ్ చెప్పిన స్టైల్ నచ్చటంతో చిన్నగా ఉన్న ఆయన పాత్రను ఎనిమిది సీన్స్‌ వచ్చే మార్చి రాశారు. సినిమా రిలీజ్ తర్వాత కోట శ్రీనివాసరావు నటుడిగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. సర్కార్ సినిమాలో సెల్వమణి పాత్రను ఇప్పటికీ మరచిపోలేం. ఆ మూవీలో కోట నటనను అమితాబ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారంటే ఆయన తన మార్కను ఏ రేంజ్‌లో చూపించారో అర్థం చేసుకోవచ్చు. తమిళంలో ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. ముప్పైకి సినిమాల్లో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతిఘటనలో ఆయన చేసిన కాశయ్య పాత్ర కెరీర్‌ను మలుపు తిప్పింది. అహ నా పెళ్ళంటలో కోట చేసిన మంగపతి పాత్ర, గణేష్ మూవీలో చేసిన విలనిజం, గాయంలో గురు నారాయణ, మనీలో కామెడీ టచ్ ఉన్న విలనిజం పాత్ర, మామగారులో చేసిన పోతురాజు పాత్ర, హలో బ్రదర్‌లో చేసిన తాడి మట్టయ్య పాత్రలను మనం మరచిపోలేం.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad