Actor Lobo Sentenced Jail: తెలుగు టెలివిజన్ రంగంలో తన విలక్షణ శైలితో ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఖయూమ్ అలియాస్ లోబో (Lobo). ఇప్పుడు ఈయనకు ఓ యాక్సిడెంట్ కేసులో శిక్ష పడింది. వివరాల్లోకెళ్తే.. ఏడేళ్ల క్రితం, 2018లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలవడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడటానికి కారణమైన కేసులో జనగామ కోర్టు (Janagama Court) గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం.. టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు. అదనంగా రూ.12,500 జరిమానాను కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు అందించిన వివరాల ప్రకారం .. యాక్సిడెంట్ మే 21, 2018న చోటుచేసుకుంది. ఆ రోజున లోబో తన బృందంతో కలిసి ఒక ప్రముఖ టీవీ ఛానెల్ తరఫున ఒక వీడియో చిత్రీకరణ ప్రాజెక్ట్ కోసం వరంగల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లోబో రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, అలాగే పురాతన వేయిస్తంభాల ఆలయం వంటి చారిత్రక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత లోబో స్వయంగా కారు నడుపుకుంటూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమయ్యారు.
రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్దకు చేరుకోగానే లోబో నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న ఒక ఆటోను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/balakrishna-akhanda-2-postponed-officially/
ప్రమాదం తీవ్రతకు లోబో ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది, అయితే లోబోతో పాటు అతని బృంద సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లోనే రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం లోబో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించింది. నేరం రుజువు కావడంతో జనగామ కోర్టు ఈ గురువారం తీర్పును వెలువరించింది. లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తీర్పుతో లోబో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


