Comedian Ramachandra: ఒకప్పుడు తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారు. ఆయనకు ఇటీవల పక్షవాతం రావడంతో కాళ్లు చేతులు పడిపోయి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తెలిసిన సినీ అభిమానులు షాక్ అవుతున్నారు.
కమెడియన్ రామచంద్ర అనే పేరు చెబితే మన ఆడియెన్స్‌కు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. అయితే ఆయన సినిమాల పేర్లు చెబితే ఆయన గుర్తుకు వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ‘ఆనందం’, ‘సొంతం’, ‘వెంకీ’, ‘కింగ్’, ‘దుబాయ్ శీను’, ‘లౌక్యం’ వంటి అనేక చిత్రాలలో హీరో స్నేహితుడి పాత్రల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందారు. దాదాపు 100 సినిమాలలో అలరించారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా.. ప్రస్తుతం ఆయన జీవితం ఒక విషాద మలుపు తిరిగింది.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామచంద్ర తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. పక్షవాతం కారణంగా ఆయన ఎడమ కాలు, చెయ్యి పడిపోయాయి. అంతేకాదు మెదడులో రక్తం గడ్డకట్టింది. వైద్యులు ఆయనకు రెండు నెలల పాటు పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలని, రోజువారీ ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. ట్రీట్‌మెంట్‌కు ఖర్చు బాగానే అవుతుంది. ఇప్పటికే ఆసుపత్రి ఖర్చులు రూ. 80,000 వరకు అయ్యాయని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ద్వారా గరిష్ట మొత్తం కవర్ అయిందని రామచంద్ర తెలిపారు. అయితే, మిగిలిన వైద్య ఖర్చుల కోసం, తన చికిత్స కొనసాగింపు కోసం ఆయన దాతల సహాయాన్ని, సినీ పరిశ్రమ నుండి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నారు.
రామచంద్ర తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోగా, ప్రస్తుతం తన తమ్ముడు తన బాగోగులు చూసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. తోటి నటులకు తన పరిస్థితిని తెలియజేశానని, వారి ద్వారా ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలకు చేరుతుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పరిశ్రమ నుండి ఎవరూ తనకు ఫోన్ చేసి పరామర్శించలేదని ఆయన బాధతో తెలిపారు. రామచంద్రకు సహాయం చేయడానికి సినీ పరిశ్రమ పెద్దలు, తోటి నటులు, మరియు దాతలు ముందుకు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read- Bigg Boss Sri Satya: సెగలు రేపుతున్న శ్రీ సత్య.. కంట్రోల్ చేసుకోవడం కష్టమే..


