Tollywood: హీరోల కెరీర్‌లో నటించిన సినిమాలతో పాటు వదులుకున్నవి చాలానే ఉంటాయి. కొన్ని సినిమాలు కథ ఓకే అయ్యే దశలోనే ఆగిపోతే మరికొన్ని ప్రాజెక్ట్‌లు మాత్రం అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ మొదలయ్యే టైమ్‌లో నిలిచిపోతుంటాయి. బడ్జెట్, డేట్ ఇష్యూస్, క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇలా సినిమా ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్‌లో అనౌన్స్ అయిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు.. ఆ తర్వాత సెట్స్‌పైకి మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
అల్లు అర్జున్ ఐకాన్.. కొరటాల శివ మూవీ…
అల్లు అర్జున్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ పేరుతో నిర్మాత దిల్‌రాజు ఓ మూవీని అనౌన్స్ చేశాడు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఐకాన్ అనే టైటిల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ పోస్టర్‌తోనే ఈ సినిమాకు పుల్‌స్టాప్ పడింది. కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీని చేయాల్సింది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. అనివార్య కారణాల వల్ల ఈ కాంబినేషన్ మాత్రం వర్కవుట్ కాలేదు.
Also Read- Plea Against Pawan Kalyan: ప్రభుత్వం డబ్బుతో ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్
మహేష్‌బాబు – సుకుమార్ మూవీ…
వన్ నేనొక్కడినే తర్వాత హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సింది. వీరిద్దరి కలయికలో 2019లో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను ప్రకటించింది. నైజాం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబు కూడా సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో ఈ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నాడు. మహేష్‌బాబు సినిమా స్థానంలో పుష్ప మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చాడు సుకుమార్.
రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ…
రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ హ్యాట్రిక్ సక్సెస్‌ల తర్వాత వీరిద్దరి కలయికలో నాలుగో మూవీకి సంబంధించి లాంఛింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరోయిన్‌గా ఈ మూవీలో ఇందుజ రవిచంద్రన్‌ను తీసుకున్నారు. తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. షూటింగ్ మొదలయ్యే టైమ్‌లో బడ్జెట్ పరమైన కారణాల వల్ల ఈ సినిమాను పక్కనపెట్టారు.
పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమా…
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చేసిన సినిమాల కంటే ఆగిపోయినవే ఎక్కువగా ఉన్నాయి. ఒకే సారి ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లుతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. హరిహర వీరమల్లు రిలీజ్ కాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి మూవీ మాత్రం ఆగిపోయింది.
జనగణమన…
లైగర్ షూటింగ్‌లో ఉండగా… పూరి జగన్నాథ్‌తో జనగణమన సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లోకేషన్స్ కోసం రెక్కీ కూడా నిర్వహించారు. కానీ లైగర్ డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ జనగణమన మూవీ నుంచి తప్పుకున్నాడు.
రానా దగ్గుబాటి హిరణ్యకశ్యప, రాక్షసరాజ, నాగచైతన్య – పరశురామ్ మూవీ, చిరంజీవి – వెంకీ కుడుముల సినిమా, విజయ్ దేవరకొండ హీరో మూవీతో పాటు సాయిధరమ్‌తేజ్ – సంపత్ నంది గంజా శంకర్ ఇలా అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన సినిమాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి.


