Nag Ashwin: భారత ప్రభుత్వం తీసుకున్న జి.ఎస్.టి సంస్కరణలు ఇప్పుడు యావత్ సినీ ఇండస్ట్రీలోనూ (Cinema Industry) చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలపై చిత్రసీమలో ఒకపక్క హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మార్పులు పరిశ్రమకు పెద్దగా ప్రయోజనం చేకూర్చవన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ. 100 లోపు ఉన్న సినిమా టికెట్లపై మాత్రమే జీఎస్టీ భారం తగ్గుతుంది. ఇది చిత్రరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహకరం కాదని పలువురు చెబుతున్నారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జి.ఎస్.టి సంస్కరణల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు.. చిన్న పట్టణాల్లోని హాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 100లోపు ఉన్న సినిమా టికెట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. అయితే, రూ. 100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై మాత్రం 18 శాతం జీఎస్టీ వసూలు కొనసాగుతుంది. మల్టీప్లెక్స్ (Multiplex), ప్రీమియం థియేటర్లలోని టికెట్లపై కూడా జీఎస్టీ భారాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకుని ఉంటే సినీ రంగానికి మరింత ప్రోత్సాహకరంగా ఉండేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read – Spirit Movie: స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్
ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తన సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి (Narendra Modi) విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన ఆయన 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌ని కేవలం రూ. 100 లోపు టికెట్లకే కాకుండా రూ. 250 వరకూ పొడిగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మార్పు మన పరిశ్రమ, థియేటర్లు అభివృద్ధి చెందడానికి అలాగే మధ్య తరగతి ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఎంతో అవసరం అని.. చాలా తక్కువ థియేటర్లు మాత్రమే ఇప్పుడు రూ.100 లోపు ధరలతో టికెట్లు విక్రయిస్తున్నాయని కూడా ఆయన తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. అంటే అధిక శాతం సినిమా టికెట్లపై ఇంకా 18 శాతం జీఎస్టీ కొనసాగుతుందనే అర్థం.
వినోద రంగానికి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ప్రజలకు అందుబాటు ధరల్లో వినోదం అందుతుంది. నాగ్ అశ్విన్ వంటి సినీ ప్రముఖుల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, జీఎస్టీ సంస్కరణలను విస్తృతం చేస్తే, అది కేవలం సినీ పరిశ్రమకే కాకుండా, లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి ప్రధాని ఈ రిక్వెస్ట్‌ను పట్టించుకుంటాడో లేదో చూడాలి మరి.
Also Read – Heart attack: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. గుండెపోటుతో పదేళ్ల బాలుడు మృతి!


