Tollywood: సినీ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మె కారణంగా గత నాలుగు రోజులుగా చిన్న, పెద్ద సినిమాల షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచాయి. బంద్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ బంద్‌కు సంబంధించి ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు, ఫిలిం ఛాంబర్‌కు మధ్య గత మూడు రోజులుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికులు విధించిన డిమాండ్‌కు నిర్మాతలు అంగీకరించడం లేదు. మరోవైపు పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆరోజే చెల్లించాలని సినీ కార్మికులు అంటున్నారు. కార్మికుల డిమాండ్స్ అమోదయోగ్యంగా లేవని నిర్మాతల మండలి చెబుతోంది.
మరోమారు…
గురువారం రోజు సమ్మెకు సంబంధించి ఫెడరేషన్ సభ్యులతో నిర్మాతల మండలికి మరోమారు ఫిలిం ఛాంబర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిర్మాతలు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి…బాలకృష్ణ…
సమ్మెకు సంబంధించి తెలుగు నిర్మాతలు అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణలను వేర్వేరుగా కలిశారు. తమ సమస్యలను వారికి వివరించారు. తాజాగా ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవిని గురువారం కలబోతున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతోనూ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ కానున్నట్లు తెలిసింది.
Also Read- Ustaad Bhagat Singh: సంక్రాంతి బరిలో ఉస్తాద్ భగత్‌సింగ్ – నిర్మాత ఏమన్నారంటే?
అత్యవసర సమావేశం…
తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మి రాజు, ట్రెజరర్ అలెక్స్‌తో పాటు మిగిలిన సభ్యులు పాల్గొన్నారు.
చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటాం…
సమావేశం అనంతరంప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం చిరంజీవి పెద్దగా ఉన్నారని, ఆయన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని అన్నారు. తమ సమస్యలకు చిరంజీవి సరైన పరిష్కారం చూపిస్తారనే నమ్మకముందని చెప్పారు. ఇండస్ట్రీలో నిర్మాతలు బాగుండాలని, వారితో పాటు కార్మికులమైన తాము బాగుండాలి అని తెలిపారు.
ఏ రోజు వేతనాలు ఆరోజే…
“కార్మికుల వేతనాలు పెంచాలి. ఆ పెంచిన వేతనాలు ఏరోజుకారోజు ఇవ్వాలి ఇదే మా ప్రధాన డిమాండ్. మా సమస్య పరిష్కారం కోసం అన్ని సంఘాలతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం. గురువారం రోజుతో మాకు సానుకూల ఫలితం లభిస్తుందని అనుకుంటున్నాం. మా డిమాండ్స్‌కు సంబంధించి నిర్మాతలు కొన్ని రూల్స్ చెప్పారు వాటికి అంగీకరిస్తే మాకేం అభ్యంతరం లేదనిఅంటున్నారు. కానీ నిర్మాతలు చెప్పేది వివరంగా లేదు. కాల్షీట్స్, హవర్స్ లెక్కలంటూ ఏదేదో మాట్లాడారు. మాకెవ్వరికి వారు చెప్పివని అర్థం కాలేదు. నాన్ మెంబర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. సండేల్, హాలీడేస్‌తో పాటు సింగిల్ కాల్‌షీట్స్ గురించి నిర్మాతలు మాట్లాడారు. గురువారం మరోసారి వాటి గురించి మాతో వివరంగా చర్చిస్తామని అన్నారు. ఆ చర్చల తర్వాతే సమ్మెపై తుది నిర్ణయానికి వస్తాం” అని అనిల్ వల్లభనేని చెప్పారు.
Also Read- Viral Video: ఇదేం పైత్యం రా బాబు! బెడ్ రూమ్ లో పాములను పెంచుతున్న యువతి.. వైరల్ గా వీడియో..
విశ్వప్రసాద్ మాటలు కరెక్ట్ కాదు…
తెలుగు సినీ కార్మికుల్లో స్కిల్స్ లేవంటూ నిర్మాత విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్‌ను అనిల్ వల్లభనేని తప్పుపట్టారు. “స్కిల్స్ లేవని అనడం కరెక్ట్ కాదు స్కిల్ లేకుండానే తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయికి వచ్చిందా? అన్నది ఆయనే చెప్పాలి. అలాగే సభ్యత రుసుము గురించి కూడా కొందరు ప్రొడ్యూసర్లు మాట్లాడారు. అది ఫెడరేషన్ అంతర్గత వ్యవహారం. కార్మికుల నుంచి సభ్యత్వ రుసుము తీసుకున్నా దాన్ని యూనియన్ వాళ్ళకే ఆపదలో ఖర్చు చేస్తాము” అని అని అనిల్ వల్లభనేని పేర్కొన్నారు.


