Manchu Manoj: గణేశ్ మహారాజ్ వేడుకలను దేశం యావత్తు ఎంత ఘనంగా నిర్వహిస్తారో మనకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దేశంలోనే పేరు పొందిన బాలాపూర్‌లో గణేశ్ నవరాత్రి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహిస్తారో మనకు తెలిసిందే. బాలాపూర్ లడ్డుకి జరిగే వేలం పాట.. ఆ లడ్డు పలికే ధర ఎప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియా అవుతుంటుంది. బాలాపూర్ గణేశుడిని సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం దర్శించుకుంటుంటారు. తాజాగా బాలాపూర్ గణేశుడిని టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు. అలాగే అక్కడకు వచ్చిన చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
మంచు మనోజ్ (Manchu Manoj) వస్తున్నాడని తెలిసిన వెంటనే బాలాపూర్ గణేశ్ (Balapur Ganesh) ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. గణేశుని ప్రత్యేక పూజల్లో మనోజ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన్ని సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా జరిగే ఉత్సవాల్లో మనోజ్ పాల్గొంటుంటారు. గతంలోనూ ఆయన తన సతీమణి మౌనికతో కలిసి ఖైరతాబాద్ గణేశున్ని కూడా దర్శించుకుని పూజల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అదే ఆనవాయతీని ఆయన ఈ ఏడాది కూడా ప్రదర్శించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం హీరోగానే కాదు.. విలన్‌గానూ నటించటానికి సిద్దంగా ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన భైరవం సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 12న (Mirai Release date) విడుదల కాబోతున్న మిరాయ్ సినిమాలోనూ ఆయన ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మిరాయ్ సినిమాలో తను చేసిన విలన్ పాత్రపై మంచు మనోజ్ భారీ ఆశలనే పెట్టుకున్నాడనాలి. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాటల్లోనే ఆ విషయం స్పష్టంగా తెలిసింది. ఇలాంటి పాత్రను తాను ఇంత వరకు చేయలేదని చెప్పిన మనోజ్.. తన ఫేవరేట్ హీరోయిన్ శ్రియా శరన్‌తో (Shriya Saran) కలిసి ఈ సినిమాలో పని చేయటం చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్పారు.
ఇది కాకుండా 90 ఎం.ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న అత్తరు సాయిబు చిత్రంలో హీరోగా మెప్పించనున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఇప్పుడు రూట్ మార్చి హీరోగానే కాకుండా విలన్‌గానూ మెప్పించటానికి సిద్ధమవుతుండటం విశేషం.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/balakrishna-akhanda-2-postponed-officially/


