Rahul Sipligunj: టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య పేరు హరిణ్యారెడ్డి. ఆమె స్వస్థలం నెల్లూరు అని సమాచారం. హరిణ్యారెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెబుతున్నారు. రాహుల్, హరిణ్యా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో పెళ్లి…
ఎంగేజ్‌మెంట్ ఫొటోలను రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు హరిణ్యారెడ్డి తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేయలేదు. త్వరలోనే రాహుల్, హరిణ్యా పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.
నాటునాటు పాటతో…
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో రాహుల్ సిప్లిగంజ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్రను సృష్టించింది. రాహుల్ సిప్లిగంజ్‌కు ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల బహుమతిని అందజేశాడు. ఆస్కార్ గెలిచిన సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పది లక్షలు అందించారు రేవంత్ రెడ్డి…
బిగ్‌బాస్ విన్నర్‌గా…
ర్యాపర్‌గా యూట్యూబ్ సాంగ్స్‌తో రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ ఆరంభమైంది. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ మూవీతో సింగర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. ఈగ, రచ్చ, రంగస్థలం, మహర్షి, ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లులో నాలుగు పాటలు పాడాడు రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడు.
Also Read – Janhvi Kapoor: కృష్ణాష్టమి వేడుకలపై ట్రోల్స్ – ఇచ్చిపడేసిన జాన్వీకపూర్


