Udayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాష్ట్ర క్రీడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇన్నాళ్లు ఉదయనిధి స్టాలిన్ సినిమాలను చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. తండ్రి స్టాలిన్‌కు చేదోడువాదోడుగా ఉంటూ డీఎంకే పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే విజయం సాధించడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఉదయనిధి స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. డీఎంకే లో ఉదయనిధి స్టాలిన్‌కు మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రమంలో.. ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ సీనియర్, జూనియర్ నేతల నుంచి సీఎం స్టాలిన్‌పై ఒత్తిడి వచ్చింది.
మరోవైపు ప్రతిపక్షపార్టీలు వారసత్వంపై విమర్శలు చేయడంతో స్టాలిన్ తన కొడుకును మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు వెనుకడుగు వేశాడు. కానీ పార్టీ నేతల ఒత్తిడిమేరకు మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. దీంతో బుధవారం తమిళనాడు రాష్ట్ర క్రీడా మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే, ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగాల్సి రావడంతో సినిమాలను పక్కనపెట్టేందుకు ఉదయనిధి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ హీరోగా మామన్నావ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతుంది. దానిని పూర్తిచేస్తానని తెలిపాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న మామన్నాన్ మూవీకాగా.. రెండోది కమల్ హాసన్ సొంత బ్యానర్‌లో చేయాల్సిన సినిమా. కానీ.. ఇప్పటికే షూటింగ్ అయిపోతున్న మామన్నాన్ మూవీని పూర్తి చేస్తానని క్లారిటీ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. కమల్ హాసన్ బ్యానర్‌లో చేసేందుకు అంగీకరించిన సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.