Kingdom movie controversy : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వచ్చిన ‘కింగ్‌డమ్’ చిత్రంపై తమిళనాట వివాదాల సుడిగుండం ముసురుకుంది. శ్రీలంక తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, వారి చారిత్రక పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఈ సినిమాలో దృశ్యాలున్నాయంటూ తమిళ జాతీయవాద పార్టీలు భగ్గుమన్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో తమ జాతిని అవమానిస్తారా అంటూ థియేటర్ల వద్ద ఆందోళనలకు దిగాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది..? ఈ వివాదానికి కారణమైన ఆ దృశ్యాలేంటి..? ఈ నిరసనల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి..?
శ్రీలంక తమిళులను బానిసల్లా చూపారా : తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘కింగ్‌డమ్’ సినిమాను తమిళనాడులో వెంటనే నిషేధించాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. ఈ సినిమాలో శ్రీలంక తమిళులను తప్పుడు కోణంలో, అత్యంత అవమానకరంగా చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారత్ నుంచి శ్రీలంకకు వలస వెళ్లిన తమిళులను బానిసల్లా, అంటరానివాళ్లుగా చూస్తారనే విధంగా ‘కింగ్‌డమ్’లో సన్నివేశాలున్నాయి. ఇది దారుణం. హీరోయిక్‌గా సాగిన తమిళ ఈలం విముక్తి పోరాటాన్ని, శ్రీలంక తమిళుల చరిత్రను వక్రీకరించే కుట్రలో భాగమే ఈ సినిమా” అని వైకో ధ్వజమెత్తారు. సింహళ ప్రభుత్వం సాగించిన నరమేధంలో లక్షలాది మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
థియేటర్ల వద్ద ఉద్రిక్తత.. అరెస్టులు : మరోవైపు ‘నామ్ తమిళార్ కచ్చి’ (NTK) పార్టీ సమన్వయకర్త సీమన్ కూడా ‘కింగ్‌డమ్’పై విరుచుకుపడ్డారు. శ్రీలంక తమిళులను నేరస్తుల్లా అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో తమిళ జాతి చరిత్రకు మసిపూసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఆయన పిలుపుతో ఎన్‌టీకే కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
రామనాథపురంలోని ఓ థియేటర్‌ను ముట్టడించి, సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగింది. అదేవిధంగా, కోయంబత్తూరులో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ను చుట్టుముట్టి నిరసన తెలిపిన 16 మంది ఎన్‌టీకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
బాక్సాఫీస్ వద్ద తగ్గిన జోరు : ఈ వివాదాల ప్రభావం సినిమా కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది. తొలిరోజు రూ.18 కోట్లు వసూలు చేసిన ‘కింగ్‌డమ్’, ఐదో రోజుకు వచ్చేసరికి రూ.2.25 కోట్లతో సరిపెట్టుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. ఆగస్టు 4 నాటికి తమిళనాడు థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు కేవలం 11.39 శాతంగానే నమోదైంది. మొత్తంగా ఐదు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.43.15 కోట్లు వసూలు చేసింది. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు.


