తమిళ హీరో విశాల్(Vishal) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన విశాల్ పూర్తి నిరసంగా కనపడ్డారు. మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న వారు కంగారు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో విశాల్‌కు ఏమైంది? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన టీమ్ వైద్యుల రిపోర్ట్‌ను విడుదల చేసింది. విశాల్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఆరోగ్యం వార్తలపై విశాల్ స్పందించారు. శనివారం సాయంత్రం ‘మదగజరాజ’ ప్రీమియర్‌కు హాజరైన విశాల్.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారని.. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్యల్లేవు అన్నారు. ఇప్పుడు తన చేతులు వణకడం లేదని.. మైక్ కూడా కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నానని చెప్పారు. అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయని వెల్లడించారు.
కాగా ఇటీవల జరిగిన ఈవెంట్‌తో పోలిస్తే విశాల్ ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించారు. దాదాపు 12 ఏళ్ల క్రితం పూర్తైన ‘మదగజరాజ’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటించారు.