Zee Writers Room Initiative: మీ మదిలో మెదిలే కథలకు తెరరూపం ఇవ్వాలని ఉందా? మీ కలం బలంపై నమ్మకంతో సినీ, టీవీ రంగంలో రచయితగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారా? అయితే, దేశంలోని అగ్రగామి వినోద సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) మీ కోసమే ఒక సువర్ణావకాశాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా మారుమూలల్లో ఉన్న కథకులను వెలికితీసి, వారికి సరైన వేదికను కల్పించే లక్ష్యంతో ‘జీ రైటర్స్ రూమ్’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఈ ‘జీ రైటర్స్ రూమ్’ ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఎలా భాగస్వాములు కావాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
జీ రైటర్స్ రూమ్:
ఇది కేవలం ప్రతిభను అన్వేషించే ప్రయత్నం మాత్రమే కాదు, ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ బ్రాండ్ తత్వానికి అద్దం పట్టే ఒక సృజనాత్మక ఉద్యమం. వినోద పరిశ్రమలో సరికొత్త కథలకు, వినూత్న ఆలోచనలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, కథ చెప్పే సహజ సామర్థ్యానికి, వృత్తిపరమైన స్క్రీన్ రైటింగ్ ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏడు భాషల్లో (హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) ఉన్న ఔత్సాహిక కథకులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన రచయితలకు, ‘జీ’ సంస్థకు చెందిన టీవీ, డిజిటల్ (ఓటీటీ), మరియు సినిమా ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు, స్క్రీన్‌ప్లేలు రూపొందించే అవకాశం లభిస్తుంది. 80 నగరాల్లో, 32 ఈవెంట్ సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
ప్రముఖుల మాటల్లో :
ఈ కార్యక్రమంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, రాఘవేంద్ర హున్‌సూర్ మాట్లాడుతూ, “భవిష్యత్ తరం రచయితల ప్రతిభను ప్రోత్సహించడం మా కర్తవ్యం. జీ రైటర్స్ రూమ్‌తో సరికొత్త స్వరాలకు, ఇప్పటివరకూ వెలుగులోకి రాని ఆలోచనలకు మేం ఒక వేదికను సృష్టిస్తున్నాం. ఇది పోటీ కాదు, రచయితలకు నైపుణ్యం, అవకాశం, మార్గదర్శకత్వం అందించాలనే మా నిబద్ధత,” అని అన్నారు.
చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహాదేవ్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం ద్వారా విభిన్నమైన కథలు చెప్పగల రచయితల సమూహాన్ని నిర్మిస్తున్నాము. రేపటి తరం కథకులుగా మారేందుకు రచయితలకు ద్వారాలు తెరుస్తున్నాం,” అని పేర్కొన్నారు.
చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ (సౌత్ & వెస్ట్), సిజూ ప్రభాకరన్ మాట్లాడుతూ, “దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో కథలు చెప్పే సంస్కృతి ఎంతో శక్తివంతమైనది. అక్కడి సృజనాత్మకతను టీవీ, ఓటీటీ, సినిమాలకు అవసరమైన కంటెంట్‌గా మలచడానికి జీ రైటర్స్ రూమ్ సహాయపడుతుంది,” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంపిక ప్రక్రియ:
ఔత్సాహిక రచయితలు ఈ కార్యక్రమంలో చేరడానికి ఒక స్పష్టమైన, పారదర్శకమైన ఎంపిక ప్రక్రియను రూపొందించారు.
రిజిస్ట్రేషన్- పరీక్ష:
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా www.zeewritersroom.com వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఒక ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
షార్ట్‌లిస్టింగ్:
పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా, టాప్ 10% మందిని నిపుణులతో కూడిన రీడింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
ఇంటర్వ్యూ ప్రక్రియ:
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కూడిన ప్యానెల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ ఇంటర్వ్యూల ద్వారా తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశం:
తుది ఎంపికలో నిలిచిన టాప్ 100 మంది ప్రతిభావంతులు ‘జీ రైటర్స్ రూమ్’లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వారికి నిపుణుల మార్గదర్శకత్వంలో తమ కథా ఆలోచనలకు మెరుగులు దిద్దుకునే అవకాశం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం..? మీలోని కథకుడికి పట్టం కట్టేందుకు, మీ కలలకు రెక్కలు తొడిగేందుకు ‘జీ’ అందిస్తున్న ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి.


