Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలు10th paper leakage: పది ప్రశ్నపత్రం 'లీకేజీ' నలుగురిపై సస్పెన్షన్ వేటు

10th paper leakage: పది ప్రశ్నపత్రం ‘లీకేజీ’ నలుగురిపై సస్పెన్షన్ వేటు

పదవ తరగతి ప్రశ్నపత్రం పరీక్ష మొదలైన 7 నిమిషాలలోనే వాట్సాప్ లలో చక్కర్లు కొట్టి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నంబర్ – 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్షా ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో వెల్లడిస్తూ.. సోమవారం తాండూరులోని పది పరీక్షా కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉ: 9-05 గంటలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 9-30 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష కేంద్రంలో 260 మంది విద్యార్థులకు గాను 258 మంది హాజరు కాగా రూమ్ నెంబర్ 5 లో పరీక్షకు హాజరు కాని విద్యార్థి ప్రశ్న పత్రాన్ని 9:15 నిమిషాలకు ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయుడికి షేర్ చేయడమే గాక మీడియా గ్రూపులో సైతం షేర్ కావడంతో విషయం బయట పడిందన్నారు.

- Advertisement -

ఈ విషయం పై ఆరా తీయగా పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేసిన పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 ఉన్నత పాఠశాల నుంచి బందెప్ప అనే ఉపాధ్యాయుడు ఫోన్ ద్వారా వాట్సాప్‌లోకి వచ్చినట్లు గుర్తించారు. అదే పాఠశాలలో బందెప్ప సైన్స్ టీచర్ గా పనిచేస్తుండగా తొలిరోజు నిర్వహించిన పరీక్షకు ఆయనను రిలీవర్‌గా వ్యవహరించారని, రూమ్ నెంబర్ 5 లో ఉన్న శ్రీనివాస్ అనే టీచర్ నుండి తెచ్చి తన ఫోన్ ద్వారా ఫోటో తీసి  పంపినట్లు రుజువైందన్నారు. ఈ లీకేజీకి పాల్పడిన  బందెప్ప, సమ్మప్ప, గోపాల్, శివ ప్రసాద్ టీచర్ లను సస్పెండ్ చేశామన్నారు. పరీక్ష పేపర్ లీకేజీ అయిన 5వ నంబర్ రూమ్  ఇన్విజిలేషన్  శ్రీనివాస్ ను  కూడా విధుల నుండి తప్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. టీచర్లు పథకం ప్రకారమే లీకేజీకి పాల్పడినట్లు రుజువైందన్నారు.  

తల్లిదండ్రులూ ఆధైర్య పడొద్దు..

తల్లిందండ్రులు అధైర్య పడవద్దని, పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని, ప్రశ్నాపత్రం పాల్పడిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నట్టు, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. లీకేజీకి పాల్పడినప్పటికీ పరీక్ష ప్రారంభం కంటే ముందు జరగలేదు కనుక విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధైర్య పడొద్ధని సూచించారు.

 సర్కారు సీరియస్

పదోతరగతి కొషన్ పేపర్ లీకేజ్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది.  అసలు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించటం ఏంటని సీరియస్ అంది.  ఈమేరకు లీకేజీ ఉదంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డిని సర్కారు ఆదేశించింది. పేపర్ లీకేజ్ కు కారకుడైన టీచర్ బందప్పను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

పోక్సో కేసులో ఇదే టీచర్

నిజానికి బందప్పపై గతంలోనూ ఎన్నో ఫిర్యాదులుండగా ఆయనకు వివాదాలు కొత్త కాదని తెలుస్తోంది. 2017లో పోక్సో చట్టం కింద ఇతనిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఈసందర్భంగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. స్కూల్లో ఒక విద్యార్థినిని బందప్ప గతంలో వేధించగా ఈ కేసు నమోదయింది.

పేపర్ లీక్ కాలేదంటున్న పోలీసులు

ఓవైపు ఎంఈవో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదైతే చేశారు కానీ అసలు పేపర్ ఎక్కడా లీకే కాలేదని పోలీసులు చెబుతుండటం విశేషం.  అసలు పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్ బయటకు వచ్చిందనేది పోలీసులు వాదన. 9.30కి పరీక్ష ప్రారంభం కాగా 9.37కు పేపర్ బయటకు వచ్చిందని వారు వివరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విద్యాశాఖ విచారణ చేపట్టింది.

యథాతథంగా పరీక్షలు

టెన్త్ పరీక్షలు యథాతథంగానే జరుగుతాయని ఎటువంటి వాయిదా వేయటం లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన స్పష్టంచేశారు.  శివకుమార్, కే గోపాల్, ఎస్ బండప్ప, సమ్మప్పలను లీకేజీకి సంబంధించిన కేసులో సస్పెండ్ చేసినట్టు సర్కారు స్పష్టంచేసింది.

సబితను సస్పెండ్ చేయాల్సిందే..

పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది.  ఈమేరకు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ బోర్డును ముట్టడించారు.  బీఆర్ఎస్ దిష్టి బొమ్మలకు ఉరివేసి వీరు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.  విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.  కాగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దటంతో ధర్నా అక్కడికే ముగిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News