ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University) పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం ప్రశ్నాపత్రం లీక్ కావడం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ బయటికొచ్చింది.
దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, పరీక్షను రద్దు చేశారు. కాగా, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేపర్ లీక్ తో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.
ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని దీనికి బాధ్యులు అయిన వారిపై కఠిన చర్యలుంటాయని నారా లోకేశ్ హెచ్చరించారు. పరీక్షకి అరగంట ముందు లీక్ అవ్వడం దారుణమన్నారు. కొందరూ ఇది కావాలనే చేసినట్టు అర్థమవుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి పునరావృతం కావొద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.