Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుAdulterated Liquor: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌, జోగి రాముకు రిమాండ్

Adulterated Liquor: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌, జోగి రాముకు రిమాండ్

Ap Adulterated Liquor case: కల్తీ మద్యం కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న జోగి రమేష్ (ఏ18), జోగి రాము (ఏ19) లకు ఎక్సైజ్ కోర్టు ఈ నెల అక్టోబర్ 13 వరకు రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ అరెస్టుతో కల్తీ మద్యం కేసులో మొత్తం నిందితుల సంఖ్య 23కి చేరింది, ఇప్పటివరకు పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఈ కల్తీ మద్యం కుంభకోణంలో జోగి సోదరుల పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. ప్రధాన నిందితులైన జనార్ధన్‌ రావు, జగన్మోహన్‌ రావు కల్తీ మద్యం వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు నిర్వహించడానికి జోగి సోదరులే ప్రోత్సహించారని కోర్టుకు సమర్పించారు.

ఈ కేసులో ఆర్థికపరమైన లావాదేవీలు ప్రధాన అంశంగా ఉన్నాయి. జనార్ధన్‌ రావు సోదరులు మరియు జోగి సోదరుల మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయని ప్రభుత్వ న్యాయవాదులు వెల్లడించారు. కల్తీ మద్యం ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును జనార్ధన్‌ రావు విడతల వారీగా జోగి సోదరులకు అందించారని పేర్కొన్నారు. అంతేకాక, ఇబ్రహీంపట్నంలో బార్ ఏర్పాటు కోసం జోగి రమేష్‌, జోగి రాములు జనార్ధన్‌ రావుకు ఆర్థిక మరియు రాజకీయ సాయం కూడా అందించినట్లు ప్రభుత్వ వాదనల్లో స్పష్టం చేశారు. ఈ కల్తీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఈ సోదరుల పాత్ర కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు, తాను జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీ వ్యాపారం చేసినట్లు పోలీసుల విచారణలో, అలాగే ఒక వీడియోలోనూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా జోగి రమేష్ ఆదేశాల మేరకే ఈ వ్యాపారం నడిపినట్లు ఆయన వెల్లడించారు.

నకిలీ మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి జోగి రమేష్ తనకు రూ. 3 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారని జనార్దన్‌రావు సిట్ విచారణలో పేర్కొన్నారు.

అద్దేపల్లి సోదరులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించగా, వారు జోగి రమేష్ పేరును మరోసారి ధృవీకరించారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం నిర్వహిస్తున్నప్పటి నుంచి జోగి రమేష్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఆధారాలు సమర్పించారని విశ్వసనీయ సమాచారం.

నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం తయారీని ఆపాలని అనుకున్నా, జోగి రమేష్ ఇచ్చిన భరోసాతోనే బెంగళూరు నుంచి మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్‌, కార్మెల్‌ వంటి ముడిసరుకులను భారీగా రప్పించినట్లు అద్దేపల్లి సోదరులు వెల్లడించారు.

ఈ వాంగ్మూలాలు, ఆధారాల పరిశీలన తర్వాతే పోలీసులు జోగి రమేష్‌ను (ఏ18), జోగి రామును (ఏ19) అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టుతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 23కి చేరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad