Andhra Woman Dies by Suicide 6 Months After Marriage: పెళ్లైన ఆరు నెలలకే ఓ నవ వధువు తన జీవితాన్ని ముగించింది. భర్త వేధింపులు తాళలేక, చెబితే కన్నవారు ఎక్కడ బాధపడతారేమోనని తనలో తాను కుమిలిపోయింది. ఈ పండగకి తాను రాఖీ కట్టలేనని తన తమ్ముడికి కన్నీటిపర్యంతమైన లేఖ రాసింది ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగింది.
ఏం జరిగిందంటే..
కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల శ్రీవిద్య, తన భర్త రాంబాబు పెట్టే హింసను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన తమ్ముడి కోసం రాఖీతో పాటు రాసిన ఓ లేఖ అందరి హృదయాలను కలచివేస్తోంది.
“జాగ్రత్త తమ్ముడూ… ఈసారి నీకు రాఖీ కట్టలేనేమో” అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొన్న మాటలు కుటుంబ సభ్యులనే కాదు, విషయం తెలిసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పెళ్లయిన నెల రోజుల నుంచే భర్త రాంబాబు వేధింపులు మొదలుపెట్టాడని శ్రీవిద్య లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.
రోజూ తాగి వచ్చి కొట్టడం, తిట్టడం, వేరే మహిళ ముందు అవమానించడం వంటివి చేసేవాడని ఆమె తెలిపింది. భర్త పెట్టే శారీరక, మానసిక హింస భరించలేని స్థాయికి చేరడంతో ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
రాఖీ పండగకి ముందే..
అత్తింటి వేధింపులు, వరకట్న దాహానికి మరో నవ వధువు బలైపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్థాంతరంగా తనువు చాలించడం, రాఖీ పండుగకు ముందే తమ్ముడికి కన్నీటి వీడ్కోలు పలకడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


