ఆందోల్ లోని జోగిపేటలో ప్రైవేటు పాఠశాలల వ్యవహార శైలిపై తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జోగిపేటలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సాయి కృష్ణవేణి పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. జోగిపేటలో ఉన్న పాఠశాలల్లో పదవ తరగతి వరకు అన్నిటికీ అనుమతులు ఉన్నాయి, కానీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పేరుతో ఉన్న కార్పొరేట్ పాఠశాలకు మాత్రం ఎలాంటి అనుమతి లేదు. పాఠశాలకు అనుమతి లేదన్న విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఆ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ టైంలోనూ చెప్పదు యాజమాన్యం. ఈ స్కూల్ ఎదురుగానే మండల సమీకృత భవనాలుండగా ఇందులోనే మండల విద్యాధికారి కార్యాలయం కూడా ఉంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులు ఉన్నారని విషయం తెలుసుకున్న తెలుగు ప్రభ ప్రతినిధి మండల విద్యాధికారికి ఫోన్ చేయగా ఆ పాఠశాలకు అనుమతులు లేవు. కానీ ఆ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మాత్రం ఉన్నారు అని చెప్పడంతో వివరాలు అడగగా కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఒక పేరుతో అనేక బ్రాంచ్లు ఉన్నాయని అందులో జోగిపేటలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సైతం ఒకటని దానికి ఎలాంటి అనుమతులు లేవని ఎన్నిసార్లు హెచ్చరించినా పై అధికారుల ఒత్తిడితో ఏం చేయలేకపోతున్నామని మండల విద్యాధికారి బండి కృష్ణ తెలిపారు.
ఇక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయడానికి ఎలా సన్నద్ధమవుతున్నారని ప్రశ్నించగా ఆ పాఠశాల పేరుతో మరో పాఠశాల సాయి కృష్ణవేణి స్కూల్ కు అనుమతులున్నందున ఈ స్కూల్ తరపున విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేతున్నట్టు తేలింది.
తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ ఈనెల 24వ తారీఖు నుండి పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇవ్వగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు అనుమతి లేదన్న విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై పాఠశాలలో పనిచేస్తున్న అకౌంటెంట్ కం బ్రాంచ్ మేనేజర్ ను ఫోన్లో సంప్రదించగా మా దగ్గర అసలు పదవ తరగతి విద్యార్థులు లేరని చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
10 సంవత్సరాలుగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుని వెళ్లాలంటే వారికి చదువుకు సంబంధించిన బోనఫైడ్ తప్పనిసరి అనుమతి లేని పాఠశాలలో 9వ తరగతి 8వ తరగతి పదవ తరగతి బోనఫైడ్ ఎక్కడి నుంచి తెస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతి లేని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని భగ్గుమంటున్నారు.
రెండు పాఠశాలల మధ్య పదవ తరగతి విద్యార్థులు అన్యాయమైపోతున్నారన్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఎందుకు నోరు మెదపడం లేదన్నది స్థానికులలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. పదో తరగతి పరీక్షలు ప్రైవేట్ గా కట్టుకున్న వారు పాసవుతారు కానీ 9వ తరగతి 8వ తరగతి చదువుకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు ఏ పాఠశాల నుండి ఎవరిస్తారు?
మండల విద్యాధికారి బండి కృష్ణ వివరణ..
మా కార్యాలయం ముందట గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి ఒకే పేరుతో గల మరో పాఠశాల సాయి కృష్ణవేణి లో విద్యార్థులకు పరీక్ష రాసేందుకు ఫీజు కట్టారని ఆ పాఠశాలలో గల విద్యార్థుల సంఖ్య కంటే ఫీజు అధికంగా కట్టడంతో సాయి కృష్ణవేణి యాజమాన్యాన్ని అడగగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుండి నాకు ఫోన్ చేశారు కావున నేను నా పాఠశాల తరఫున ఆ విద్యార్థులకు 10వ తరగతికి పరీక్ష ఫీజు కట్టేందుకు ఒప్పుకున్నానని చెప్పడం విద్యా శాఖలో గల నియమ నిబంధనలను బేఖాతారు చేశారని మండల విద్యాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సాయి కృష్ణవేణి పై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మండల విద్యాధికారి తెలిపారు.