హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటన ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు
తెలుగు వీధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. చెడు అలవాట్లకు బానిసైన కొడుకు శ్యామ్ వావి వరసలు మరచి ప్రవర్తిస్తుండటంతో భరించలేని కన్నతల్లి సాలమ్మ హత్య చేయించింది. మోహన్ అనే వ్యక్తితో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు గోన సంచుల్లో కుక్కీ మేదర వీధి సమీపంలోని పంట కాలువ వద్ద పడవేశారు.
గోనె సంచుల్లో మృతదేహం కలకలం
అనంతరం ఏమీ తెలియనట్టు తమ కొడుకు శ్యామ్ కనిపించడం లేదని కాలనీ వాసులకు చెప్పారు. అయితే మేదర వీధిలో మూడు గోనె సంచుల్లో వ్యక్తి మృతదేహం శరీర భాగాలు ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించిన పోలీసులు మృతదేహం శ్యామ్‌దిగా గుర్తించారు. శ్యామ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించడంతో తల్లే ఈ హత్య చేయించినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం డిఎస్పీ నాగరాజు పరిశీలించారు.
విచారణ చేస్తున్న పోలీసులు
మృతుని శరీర భాగాలు పడవేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ తో పాటు శ్యామ్ పెద్దన్న సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. శ్యామ్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.