Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుAP: గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం

AP: గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం

కరుడుకట్టిన గంజాయి వ్యాపారులపై పి.డి యాక్టు

గత 2021 అక్టోబర్ 30న ఆపరేషన్ పరివర్తన ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో 90 శాతం గంజాయి వ్యాపారాన్ని, గంజాయి మొక్కల పెంపకాన్ని తుడిచిపెట్టేసినట్టు ఆంధ్రప్రదేశ్ డి.జి.పి కె. రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పెంచుతున్న గంజాయి మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఒక్క రాష్ట్రంలోనే కాక దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల నుంచే అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్ (ఎన్.డి.పి.ఎ‍స్) చట్టం కింద కేసులు నమోదు చేయడం, నిందితులను పట్టుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 2019 జూన్ నుంచి 2023 జూన్ వరకు ఈ నాలుగేళ్ల కాలంలో 6,538 కేసులను నమోదు చేయడం జరిగింది. అంతకు ముందు నాలుగేళ్లలో అంటే 2014 జూన్ నుంచి 2019 మే వరకు 2,915 కేసులను నమోదు చేయడం జరిగింది.

- Advertisement -

అంతేకాక, 2022 జూన్ నుంచి 2023 వరకు ఏజెన్సీ ప్రాంతాలలో 1029 ఎకరాలలో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,655 మంది అక్రమ రవాణాదారులను అధికారులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారని తెలిసింది. ఇందులో 5342 మంది నేరస్థులను అరెస్టు చేశారు. వీరంతా గంజాయి మొక్కలను పెంచడం దగ్గర నుంచి ఆ మొక్కలను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే వరకూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో అటవీ శాఖాధికారులు, మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు, పోలీసులు, ప్రత్యేక నిఘా అధికారులు, గిరిజనాభివృద్ధి శాఖాధికారులు కలిసి సమన్వయంతో గంజాయి పంటలను ధ్వంసం చేయడంతో పాటు, పలువురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. 2021లో సుమారు నెల రోజుల పాటు ఈ అధికారులంతా
కలసికట్టుగా తిరిగి, గంజాయి పంటలను, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టులు చేశారు.

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోని లోపలి గ్రామాల్లో కూడా అధికారులు దాడులు జరిపి సుమారు ఏడు వేల ఎకరాల్లో గంజాయి పంటను నాశనం చేయడం జరిగింది. ఈ ఏడాది జూన్ నెల వరకు సుమారు 900 ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి నాశనం చేశామని, ఈ పంటను పండించినవారిలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. వివిధ విభాగాలకు చెందిన అధికారుల ఉమ్మడి వ్యూహం, దాడుల కారణంగా గంజాయి పెంపకం, సరఫరా, వ్యాపారానికి తీరని విఘాతం ఏర్పడిందని, ఈ మూడింటి మధ్య సంబంధం దెబ్బతిందని రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. అక్రమ రవాణాదారులు, రవాణాదార్లు, పెంపకందార్లు, వినియోగదార్లు వగైరాల మధ్య ఉన్న నెట్ వర్కును అధికారులు చాలా రోజుల పాటు గమనించి, దాడులు నిర్వహించి, ఈ నెట్ వర్కును భగ్నం చేసినట్టు అధికారులు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాలలోని హోటళ్లు, లాడ్జీల మీద కన్ను వేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా వీటి యజమానులకు సూచనలు ఇచ్చామని, రవాణాదార్లను కూడా హెచ్చరించామని అధికారులు చెప్పారు. ఇక 66 మంది కరుడుకట్టిన గంజాయి వ్యాపారులపై పి.డి యాక్టును కూడా ప్రయోగించినట్టు తెలి‍సింది. కాగా, ఈ గంజాయి వ్యాపారులు, అక్రమ రవాణాదార్లు ఒడిశా నుంచి పని చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి ఈ రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు మరింత సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేయాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News