Tuesday, November 5, 2024
Homeనేరాలు-ఘోరాలుAP CID: NRIలూ బహుపరాక్, సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెడితే ఖేల్ ఖతం

AP CID: NRIలూ బహుపరాక్, సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెడితే ఖేల్ ఖతం

NRI's అకౌంట్స్ పై ఓవర్సీస్ లో స్పెషల్ టీములు

సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన, అశ్లీలమైన పోస్టింగులను నియంత్రిస్తూ ఆ రంగంలో సుహృద్బావ వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర సిఐడి విభాగం పలు చర్యలు చేప్టటినట్లు రాష్ట్ర సిఐడి విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్.సంజయ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైనటు వంటి పోస్టింగులు పెడుతూ సంస్కారవంతమైన, శాంతియుతమైన సమాజంలో ఆందోళనలను, అలజడులను సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఇక ఏమాత్రము వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో సైబర్ క్రైమ్ ఎస్.పి. హర్షవర్థన్ తో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులపైనే కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సభ్యులు, జడ్జిలు, సెలబ్రిటీలు, పలు హోదాల్లోని ఉన్నత స్థాయి అధికారులు, వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన మరియు అశ్లీలమైన పోస్టింగులను పెట్టడం నేడు మరింత పరిపాటైందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు వంటి దుశ్చర్యలు మరింత పెచ్చుమీరుతున్నట్లుగా సిఐడి విభాగం గుర్తించడం జరిగిందన్నారు. ఇటువంటి దుశ్చర్యలను అణచివేసి రాష్ట్రంలో సుహృద్బావ వాతావరణాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో సిఐడి విభాగం యుద్దం ప్రారంభించిందన్నారు. సోషల్ మీడియా రంగంలో క్రమశిక్షణ, పోలీసింగ్, చట్టపరమైన బాధ్యత పెంచడమే లక్ష్యంగా చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకై ఇప్పటికే సిఐడి ప్రత్యేక బృందాలను మరియు మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన మరియు అశ్లీలమైన పోస్టింగులను పెట్టేవారిని గుర్తించేందుకు, వాటిని నియంత్రించేందుకు అత్యధిక ఖరీదైన సాంకేతిక పరికరాలే కాకుండా సాంకేతిక సహాయం కూడా ఎంతో అవసరం ఉందన్నారు. అందుకై సానుకూల వ్యక్తుల సహాయంతో సోషల్ మీడియాను నిర్వహించే అంశం మరియు పరిశ్రమల భాగస్వామ్యంతో ఒక్కొక్క కేసు దర్యాప్తు చేసే విదానాన్ని రూపొందించేందుకు వచ్చే వారంలో విజయవాడలోను తదుపరి విశాఖపట్నంలో సమ్మిట్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో సోషల్ మీడియా మాధ్యమ సంస్థలను కూడా బాగస్వామ్యులను చేసేందుకు కృషిచేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా ఆయా సంస్థలో కూడా మానిటరింగ్ సెల్స్, పర్యవేక్షణా బృందాలను ఏర్పాటు చేసేలా వత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్.ఆర్.ఐ. అక్కౌంట్స్ ను పర్యవేక్షించేందుకు యు.కె., యు.ఎస్.ఏ. లో సి.ఐ.డి. బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

అదే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన అశ్లీలమైన పోస్టింగులను నియంత్రించేందుకు ఇప్పటి వరకూ సిఐడి విభాగం తీసుకున్న చర్యలను ఆయన వివరిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం జడ్జిలపై వచ్చే అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిపై కేసులు పెట్టామన్నారు. 2022 లో 1,450 మరియు 2023 లో 2,164 సోషల్ మీడియా పోస్టింగులను తొలగించామన్నారు. 1,465 సోషల్ మీడియా అక్కౌంట్స్ ను పర్యవేక్షించామన్నారు.  దుర్వినియోగమైన 202 సోషల్ మీడియా ఖాతాలు  పర్యవేక్షించి 31 అభ్యంతరకర ఖాతాలను గుర్తించామన్నారు.  2,972 సైబర్ బుల్లీ షీట్లు తెరవడం, 45 MLAT & 5 LOC ప్రొసీడింగ్స్ ను జారీచేశామని ఆయన వివరించారు. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News