తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. గత వారంలో ఏపీలోని విశాఖ, కడప, అనంతపురం జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు మరవక ముందే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల(Sri Chaitanya Collgege)లో శుక్రవారం విషాదం నెలకొంది. ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని డేగల యోగా నందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది,
తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె స్వస్థలం ఏపీలోని అల్లూరి జిల్లా ఏటపాక గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఆమె కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.