కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. తన ఇద్దరి పిల్లలను చంపి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు ఓ తండ్రి. పిల్లల కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి నీళ్లల్లో ముంచి చంపేశాడు తండ్రి చంద్రకిశోర్. తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. ఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హోలీ రోజే విషాదం
అంతా హోలీ సంబరాల్లో మునుగుతుంటే ఈ తండ్రి మాత్రం నీటిలోనే తన ఇద్దరి పిల్లలను ముంచేసి చంపేశాడు. ఈ విషాద ఘటన అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది.
మృతుని వివరాలు
తాడేపల్లిగూడెంకి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన తన భార్య తనూజాతో కలసి కాకినాడ అర్బన్ 2వ డివిజన్ తోట సుబ్బారావునగర్ రోడ్డు నెంబర్ -2, రామానాయపేట భూదేవి అపార్టుమెంట్‌లో ప్లాట్ నెంబర్ 202లో 9 సంవత్సరాలుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పెద్ద కుమారుడు వానపల్లి జోషిల్ (7), రెండో కుమారుడు నిఖిల్ (6)లు లిటిల్ ఉడ్స్ స్కూల్లో ఒకటో తరగతి, ఎల్‌కేజీ చదువుతున్నారు.
హోలీ సంబరాలకు వెళ్లి
శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో హోలీ వేడుకలు చేసుకునేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలసి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొద్ది సేపు అయిన తర్వాత తన పిల్లలకు యూనిఫామ్ కుట్టించేందుకు టైలర్ వద్దకు తీసుకువెళుతున్నానని చంద్ర కిషోర్ భార్యకు చెప్పి కుమారుల్ని వెంట తీసుకునిపోయాడు.
పది నిమిషాల్లో వస్తానని చెప్పి…
నిమిషాల్లోనే వస్తానని చెప్పి వెళ్లిన భర్త ఎంతకీ రాకపోవడంతో చంద్రకిషోర్ కి భార్య తనూజా ఫోన్ చేసింది. వస్తానని చెప్పి భర్త ఫోన్ పెట్టేశాడు. ఇంకా ఎంతకీ భర్త ఇద్దరు పిల్లలతో రాకపోవడంతో కంగారు పడి భర్త ఆఫీసులో పని చేస్తున్న రామమూర్తిని ఇంటికి వెళ్లి చూసి రావాలని తనూజ పంపించింది. అతడు వెళ్లగా ప్లాట్ డోర్లు లోపల నుంచి వేసి ఉండటంతో పలుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా కిటికీ గ్రిల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూశాడు.
చంద్రకిషోర్ తన పడక గదిలోనే ఫ్యానుకు ఉరి వేసుకోని విగతజీవిగా కనిపించాడు. పిల్లలు కూడా పక్కనే ఉన్న మరో గదిలోని బాత్‌రూమ్‌లో పిల్లల చేతులు, కాళ్లు కట్టి వేసి, తలలను నీటితో నిండిన బకెట్లలో ముంచడంతో చనిపోయి ఉండటాన్ని పరిశీలించి తనూజకి, పోలీసులకు సమాచారం అందించాడు రాంమూర్తి.
పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని…
భార్య తనూజ ఇంటికి చేరుకుని బోరున విలిపించింది. తన ముద్దుల కుమారులను, భర్త చంద్రకిషోర్ ను చూసి తల్లడిల్లిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చంద్రకిషోర్ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. దీనిని పోలీసులు, భార్య వచ్చి పరిశీలించగా తన పిల్లలకు పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తానూ మరణిస్తున్నట్టు ఆ నోట్‌లో ఉంది.
ఈ ఘటనపై పోలీసులు భార్య తనూజని వివరాలు అడిగి తెలుసుకున్నారు.తమకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఏమీలేవని, సొంత ప్లాటు, కారు, ఆస్తులు ఉన్నాయని మృతుడి అన్నయ్య మీడియాకి తెలిపారు. సర్పవరం ఎస్‌హెచ్‌వో బి.పెద్దిరాజు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. తన ఇద్దరి పిల్లలతో పాటు తండ్రి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామని చెప్పారు.