Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుBegging at signals: పట్టపగలు చీకటి దందా, ఈ దందా నాయకుడెవరు?

Begging at signals: పట్టపగలు చీకటి దందా, ఈ దందా నాయకుడెవరు?

దేశంలో కనిపించకుండా కోట్లలో నడుస్తున్న దందా బిచ్చమెత్తుకోవడం. ఈ బిచ్చమెత్తుకోవడం వెనుక ఉన్న మరో దందా పిల్లల కిడ్నాప్ ముఠా. అవును మనం ప్రతి రోజు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సిగ్నల్స్ వద్ద, పట్టణ, నగర ప్రాంతాల్లో అనేక మంది బిచ్చమెత్తుకునే వారిని చూస్తాం. వారిలో ముఖ్యంగా మహిళలే ఉంటారు. వారి వద్ద ఖచ్చితంగా చిన్న పిల్లలు కనిపిస్తుంటారు. చిన్న పిల్లలను ఎత్తుకొని బిచ్చమడుగుతుంటారు. అసలు ఆ చిన్న పిల్లలు వారి పిల్లలేనా అంటే 90 శాతం మంది పిల్లలు వారి సొంత పిల్లలు కారనేది అక్షర సత్యం. 10 శాతం మంది స్లమ్ ఏరియాకు చెందిన వారు అడుక్కోవడం వల్ల వారి పిల్లలై ఉండవచ్చు కానీ 90 శాతం మంది మాత్రం వారి పిల్లలు కారనేది అనేక నివేదికలల్లో తేలింది.

- Advertisement -

ఆ మిస్సింగ్ పిల్లలే వీరు

ముందుగా పిల్లల కిడ్నాప్ ముఠా గురించి తెలుసుకుందాం. భారత్ లో ప్రతి రోజు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు వందల సంఖ్యలో మిస్ అవుతున్నారు. వారి జాడలు కనిపెట్టడం కూడా కష్టమైతుంది. ఈ చిన్న పిల్లలను వివిధ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ లు కిడ్నాప్ చేస్తాయి. ఒక రాష్ట్రంలో కిడ్నాప్ చేసి మరో రాష్ట్రంలో విక్రయిస్తుంటాయి. ఇటీవలే మహారాష్ట్రలో దొరికిన కిడ్నాప్ ముఠాకు విజయవాడతో లింక్ లు బయటపడ్డాయి.

కిడ్నాపింగ్ గ్యాంగ్స్

దేశ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో వేల సంఖ్యలో చిన్నారుల మిస్సింగ్ కేసులున్నాయి. వాటిలో కేవలం వందల సంఖ్యలో కూడా కేసుల పరిష్కారం కాలేదు. చిన్నారుల జాడలేదు. చిన్నపిల్లలను ఎక్కువగా ఆస్పత్రుల నుంచి, స్కూల్ నుంచి వస్తున్నప్పుడు కిడ్నాప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎంత గాలించినా జాడ దొరకడం లేదు. సీసీ టీవీలు ఉన్న స్థలాల్లో కిడ్నాప్ అయిన కేసుల్లో మాత్రమే కాస్త పురోగతి సాధించారు. చిన్నారులను కిడ్నాప్ చేసిన తర్వాత బిచ్చమెత్తుకునే ముఠాలకు లక్షలకు అమ్మేస్తారు.

గ్రూపులు, వాటికి లీడర్లు..

చిన్నారులు బిచ్చమెత్తుకునే వారి దగ్గరికి వచ్చాక వారిని ఎత్తుకొని జన సమూహం ఉన్న ప్రాంతాల్లో మహిళలు, పురుషులు అడుక్కుంటారు. ఆ చిన్నారులకు మత్తు పద్దార్దాలు లేదా వైట్ నర్ లాంటివి ఇచ్చి ఎప్పుడు పడుకునేలా చేస్తారని పోలీసుల విచారణలోనే తేలింది. ఆ చిన్నారుల ద్వారా రోజుకు వేల రూపాయలు కూడబెడుతారు. 20 నుంచి 30 మంది ఒక గ్రూపుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అడుక్కుంటారు. వారి ద్వారా రోజుకు వేల రూపాయలు సంపాదించి అంతా ఒక దగ్గర వేసుకుంటారు. వీరి గ్రూపులకు ఒక లీడర్ ఉంటాడని, అంతా అతనికి సాయంత్రం వచ్చిన డబ్బులు ఇస్తే ఈ అడుక్కున్న వారికి కొంత డబ్బు ఇచ్చి పంపుతాడని గతంలో పోలీసు విచారణలో తేలింది. ఇలా ఇప్పుడు కూడా నడుస్తుంది. ఒక్కసారి అంతా బాధ్యతయుతంగా వ్యవహరిస్తే ఇలా ముఠాలను నెల రోజుల్లో దేశమంతా ఆటకట్టించవచ్చు.

అందుకే పోలికలుండవు!

కావాలంటే మీరూ గమనించండి. ఆ అడుక్కునే వారికి, వారి దగ్గర ఉన్న పిల్లలకు అసలు పోలిక ఉండదు. ఆ పిల్లలకు సరిగ్గా ఆహారం ఉండదు. తీవ్రమైన హింసలు కూడా పెడుతారు. ఏ తల్లి కన్నబిడ్డలో ఇలా రోడ్ల పై దరిద్రమైన స్థితిలో బతుకుతున్నారు. తిండి లేక నిద్రలేక, ఎండనక వాననక దీనమైన పరిస్థితిలో బతుకీడుస్తున్నారు. వారిని కన్న తల్లిదండ్రులకు కంటిశోకం మిగులుతుంది.

బాధ్యత మరచిన సర్కారుదే పాపం

ఆ పిల్లలను రక్షించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ప్రభుత్వాలు తమ పనిని సక్రమంగా చేయడం లేదు. ఎక్కడో చిన్న ముఠాను పట్టుకొని అధికారులు హడావుడి చేసి అంతా ఇంతా అని ప్రెస్ మీట్లలో చెప్తారు. కానీ వారు సాధించేది ఏం ఉండదు. ముందుగా ఎక్కడ బిచ్చమెత్తుకునే వారు చిన్నపిల్లలతో కనిపించినా వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. ఆస్పత్రికి తరలించి డీఎన్ఏ పరీక్ష చేయించాలి. వారి పిల్లలే అని తేలితే వారిని రోడ్లపై అలా తిరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒక వేళ వారి పిల్లలని తేలకుంటే వెంటనే ఆ మహిళ లేదా పురుషునిపై కేసు పెట్టి జైలుకు తరలించాలి. చిన్నారిని బాలసదన్ లేదా అనాథశ్రమం లేదా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించాలి. ఆ చిన్నారి తల్లిదండ్రుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించి ఆ చిన్నారిని అప్పగించాలి.

పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీనిని అమలు చేయడం లేదు. వెంటనే సర్కార్ చర్యలు చేపట్టి ఇలా బిచ్చమెత్తుకునే వారందరిని అదుపులోకి తీసుకొని ఆ చిన్నారులకు విముక్తి కల్పించి మంచి జీవితాన్ని ప్రసాదించాలి. పోలీసులు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు దీని పై ప్రత్యేక చొరవ తీసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది.

సీసీ కెమరాలున్నది దేనికో?

ప్రతి ఆస్పత్రిలో, స్కూల్స్, కాలేజీల వద్ద సీసీ కెమెరాలు ఉండాలి. ప్రతి గల్లికి ఒక సీసీ కెమెరా ఉంటే కిడ్నాప్ లను కొంచెమైనా అదుపులోకి తీసుకురావచ్చు. ఆ సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేస్తూ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా తల్లిదండ్రులు ఎంత పనులు ఉన్నా సరే అప్పుడే పుట్టిన పిల్ల వాడి దగ్గరి నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తతో ఉండాలి. ముఖ్యంగా పుట్టిన పిల్లలు ఆస్పత్రుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒకరు దగ్గర ఉండాలి. ఇంకా దరిద్రం ఏమిటంటే కొన్ని ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది ఈ ముఠాతో కుమ్మక్కయ్యి వారే ఎత్తుకెళ్లి చిన్నారులను అప్పగిస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తతో ఉండాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే మనం కిడ్నాప్ లను అరికట్టి, చిన్నారులను బిచ్చమెత్తుకునే ముఠాలో ఉండకుండా కాపాడవచ్చు.

-సంగారెడ్డి ప్రతినిధి, తెలుగుప్రభ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News