Crime against women in tribal areas : ఆడపిల్ల బతుకు అభద్రత నడుమ నలిగిపోతోంది. మానవ మృగాలు మరోసారి రెచ్చిపోయాయి. భద్రాచలం ఏజెన్సీలో ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. బస్సు దొరక్క, సాయం కోసం ఆటో ఎక్కిన ఓ అభాగ్యురాలిపై ఆటో డ్రైవర్లే కర్కశంగా ప్రవర్తించారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి, నట్టడవిలోకి తీసుకెళ్లి కామాంధులు పైశాచిక ఆనందం పొందారు. అసలు ఆ రోజు ఏం జరిగింది..? నిందితులు ఎలా వలపన్నారు..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘోరం వివరాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
బంధువుల ఇంటి నుంచి తిరుగు ప్రయాణం.. బస్సు మిస్ : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక, వారం రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. బంధువులతో కొద్ది రోజులు గడిపి, తిరిగి సొంతూరికి వచ్చేందుకు శుక్రవారం కుంట బస్టాండుకు చేరుకుంది. అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో, దిక్కుతోచని స్థితిలో నిల్చుండిపోయింది.
ఆటో రూపంలో వచ్చిన కామాంధులు : ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన ఇద్దరు వ్యక్తులు, తమ ట్రాలీ ఆటోను ఆపి ఎక్కడికి వెళ్లాలో అడిగారు. వారిని నమ్మిన బాలిక ఆటో ఎక్కింది. ఆటో కొంత దూరం ప్రయాణించాక, ఏపీలోని చింతూరు మండలం చట్టి – ఏడురాళ్లపల్లి మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాన్ని నిలిపారు. వారి ప్రవర్తనతో బాలికలో భయం మొదలైంది.
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు.. నమ్మించి మోసం : ఆటో ఆపిన నిందితులు, తమ వద్ద ఉన్న కూల్‌డ్రింక్‌ను బాలికకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అనుమానంతో ఆమె నిరాకరించింది. “ఏమీ కాదు, మేమూ తాగుతున్నాం కదా, నువ్వూ తాగు” అంటూ నమ్మబలికారు. వారి మాయమాటలు నమ్మిన ఆమె ఆ కూల్‌డ్రింక్ తాగింది. అందులో ముందే మత్తుమందు కలపడంతో, ఆమె నెమ్మదిగా స్పృహ కోల్పోయింది.
స్పృహ తప్పాక అఘాయిత్యం.. గుడి వద్ద వదిలివేత : ఆమె పూర్తిగా మత్తులోకి జారుకోగానే, ఆ కామాంధులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అదే రోజు రాత్రి తెలంగాణ పరిధిలోని పాల్వంచ మండలం జగన్నాథపురం పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలేసి పరారయ్యారు.
వెలుగులోకి వచ్చిన దారుణం.. పోలీసుల రంగ ప్రవేశం : గుడి వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు, వెంటనే ఆమెను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమెను కొత్తగూడెంలోని శక్తి సదన్‌కు తరలించారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న కుమారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసి, నేరం జరిగిన ప్రదేశం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
నిందితుల కోసం ముమ్మర గాలింపు : బాధితురాలి శరీరంపై పంటి గాట్లు, గాయాలు ఉండటంతో పోలీసులు అత్యాచారం కేసుగా నిర్ధారించారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బాధితురాలిని త్వరలోనే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.


