Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుBhupalapalli: సిరొంచ కేంద్రంగా పిడిఎస్ రైస్ అక్రమ దందా?

Bhupalapalli: సిరొంచ కేంద్రంగా పిడిఎస్ రైస్ అక్రమ దందా?

వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సిరోంచ గ్రామం అక్రమ పిడిఎస్ బియ్యానికి క్యారఫ్ అడ్రస్ గా మారింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి డిసిఎం వ్యాన్లలో అక్రమంగా సబ్సిడీ బియ్యాన్ని రవాణా చేస్తూ దళారులు కోట్లాది రూపాయలను అర్జిస్తున్నారు. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధికారులు ప్రభుత్వం ఇచ్చే వేతనాల కంటే బియ్యం రవాణా చేసే అక్రమార్కులు ఇచ్చే ముడుపుల గురించి ఎదురు చూస్తారన్న ప్రచారం ఈ ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ వేతనాల కంటే వేగంగా అధికారులకు అక్రమార్కులు ఎంత వేగంగా మూడులు ముట్ట చెబుతున్నరో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని 80 శాతం మంది లబ్ధిదారులు దళారులకు అమ్ముకుంటూ నగదు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఈ బియ్యాన్ని దళారులు సిరొంచలో ఉంటున్న ఒక రైస్ మిల్లర్ యజమానికి విక్రయించి వారి లాభం వారు తీసుకుంటున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా పొరపాటున బియ్యం పట్టుపడితే తరలించేవారు సిరొంచ పేరు చెప్పడం షరా మామూలుగా జరుగుతోంది. ఇంత విచ్చలవిడిగా సబ్సిడీ బియ్యం సరిహద్దులు దాటి వెళుతున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూల్లో మత్తులో జోగుతున్న అధికారులు అక్రమార్కులకు తమ పూర్తి అండదండలు అందిస్తూ బియ్యం అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రచారం ఉంది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు ఈ అక్రమ బియ్యం దందాపై స్పందించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి, బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు ప్రోత్సహించిన అధికారులను గుర్తించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పట్టుకున్న సబ్సిడీ బియ్యాన్ని వదిలేశారా?

రెండు రోజుల క్రితం రేగొండ నుండి సిరొంచ తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని కొంతమంది యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా, పట్టుకున్న బియ్యాన్ని భూపాలపల్లి పోలీసులు డీసీఎం వ్యాన్ తో సహా వదిలేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో లేదో అన్నది జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశిస్తే కానీ నిజా నిజాలు వెలుగు చూసే అవకాశం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News