కల్తీ మద్యం కేసులు బిహార్ సీఎం నితీష్ కుమార్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 20కి పెరిగింది. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మోతిహారి అనే ప్రాంతానికి ట్యాంక్ ద్వారా కల్తీ మద్యం సరఫరా చేయగా ఈ ప్రాంతంలోని పలు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ మొత్తం తతంగంపై సీఎం నితీష్ ఎటువంటి కామెంట్స్ చేయకపోవటం విశేషం.
2016 నుంచి బిహార్ లో మద్యనిషేధం అమల్లో ఉండగా అప్పటి నుంచీ ఇలా కల్తీ మద్యం, మరణాల సమస్య బిహార్ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది. నాటు సారాయి వంటివి దొంగగా తయారు చేసే ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున సాగుతున్నాయి. కల్తీ మద్యం తాగినవారు అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైతే వారిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్రంలో చట్టాలు రూపొందించారు. దీంతో కల్తీ మద్యం తాగి అనారోగ్యంపాలైనా ఆసుపత్రికి వెళ్లే సాహసం చేసేవారు చాలా తక్కువమంది. ఇక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాకే ఆసుపత్రికి వెళ్తున్న వారు ఎక్కువ కాబట్టి బిహార్ లో కల్తీ మద్యం కేసుల్లో మరణాలు అత్యధికంగా ఉంటున్నాయి.