Goa BITS Pilani: దక్షిణ గోవాలోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఒక విద్యార్థి తన హాస్టల్ గదిలో మరణించి కనిపించడం కలకలం రేపింది. 20 ఏళ్ల రిషి నాయర్ గురువారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో కదలకుండా మంచంపై పడి ఉన్నట్లు గుర్తించారు. అతని స్నేహితులు మరియు అధికారులు ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో, తలుపును బలవంతంగా తెరవగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత 10 నెలల్లో ఇది ఐదవ సంఘటన:
డిసెంబర్ 2024 నుండి ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు – ఓం ప్రియన్ సింగ్, అథర్వ్ దేశాయ్, కృష్ణ కసేరా, మరియు కుషాగ్ర జైన్ – కూడా ఇదే క్యాంపస్‌లోని వారి గదుల్లో మరణించారు.
ఈ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, దర్యాప్తు కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సావంత్ తెలిపారు. కాగా, ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం యాజమాన్యం ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


