మరికొద్దిగంటల్లో పెళ్లి. మూడుముళ్ల బంధంతో.. పుట్టింటికి వీడ్కోలు చెప్పి.. అత్తింట తొలి అడుగు పెట్టాల్సిన ఆ కొత్తపెళ్లి కూతురు కాటికి కాలుచాపింది. అంతా ఆనందంగా ఉన్న సమయంలో ఆమె బలవన్మరణం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. రవళి అనే మహిళకు ఆదివారం మధ్యాహ్నం వివాహం కావాల్సి ఉంది. కానీ.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లికూతురి అలంకరణలోనే ఈ ఘటనకు పాల్పడటం కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేసింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రవళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రవళి చివరి ఫోన్ కాల్ కాబోయే భర్తతో మాట్లాడిందని, ఆ తర్వాతే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ లో ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పెళ్లికి ముందే కాబోయే భర్త రవళికి చాలా కండిషన్లు పెట్టాడని, పెళ్లి కుదిరినప్పటి నుండి ఆమెను వేధిస్తున్నాడని, అతని వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని రవళి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవళి తండ్రి ఫిర్యాదు మేరకు వరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.