Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుChevella: చేవెళ్ల బస్సు విషాదం: తల్లితో పాటు ఒడిలో ఉన్న 3 నెలల చిన్నారి కూడా...

Chevella: చేవెళ్ల బస్సు విషాదం: తల్లితో పాటు ఒడిలో ఉన్న 3 నెలల చిన్నారి కూడా మృతి

Chevella tragedy: చేవెళ్ళ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బయటికి వస్తోన్న ఒక్కో విషయం కంటతడి పెట్టించేలా ఉంది. ఈరోజు ఉదయం జరిగిన ఈ విషాదంలో తల్లి ఒడిలో హాయిగా పడుకున్న మూడు నెలల చిన్నారి, తన తల్లితో పాటు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తల్లితో పాటు చిన్నారి కూడా విగత జీవులుగా పడి ఉన్న ఫోటోను చూసి నెటిజన్లు కన్నీరు మున్నీరవుతున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు (సాయిప్రియ, నందిని, తనూష) కూడా మృతి చెందారు. వీరి తండ్రి వీరిని బస్టాప్‌లో దింపిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ సమీపంలో ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా అతివేగంగా, రాంగ్‌రూట్‌లో వచ్చిన కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్రతకు ఆర్టీసీ బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అంతేకాకుండా, టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్సులోకి దూసుకురావడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరినట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, టిప్పర్ డ్రైవర్ కూడా మృతిచెందినవారిలో ఉన్నారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా గాయపడగా, వారిలో దాదాపు 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల, వికారాబాద్ ఆసుపత్రులకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డితో సహా పలువురు ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, స్థానిక ఎమ్మెల్యేను నిలదీయడం ఈ ఘటనపై ప్రజల్లో ఉన్న తీవ్ర ఆవేదనను తెలియజేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad