Murder over suspicion : ప్రేమ గుడ్డిది అంటారు.. కానీ ఇక్కడ అనుమానం ఆ ప్రేమను పైశాచికంగా మార్చేసింది. వేరే అబ్బాయితో మాట్లాడుతోందన్న చిన్న అనుమానం ఓ యువకుడిని కిరాతకుడిగా మార్చింది. పదునైన స్క్రూడ్రైవర్‌తో ఏకంగా 51 సార్లు పొడిచి, ప్రియురాలిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. రెండేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఈ దారుణ ఘటనలో, నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
బస్సులో పరిచయం.. విషాదాంతం : ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో నివసించే ఓ యువతి (బాధితురాలు), ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో రోజూ ఒకే బస్సులో ప్రయాణించేది. ఆ క్రమంలో బస్సు కండక్టర్‌గా పనిచేసే నిందితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
అనుమానం పెనుభూతంగా : కొన్నాళ్లకు, యువతి వేరే అబ్బాయితో మాట్లాడుతోందని నిందితుడు అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తల్లికి ఫిర్యాదు చేశాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేసి ఆమెను వేధించడం, గొడవపడటం, చంపేస్తానని బెదిరించడం వంటివి చేసేవాడు.
ఆ రోజు ఏం జరిగింది : డిసెంబర్ 24, 2022.. బాధితురాలి తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్లడంతో, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలోనే నిందితుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఘోరం గురించి పోలీసులు ఇలా వివరించారు:
కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, యువతి అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో పడి ఉంది.
ఆమె ముఖం, మెడ, ఛాతీపై పదునైన ఆయుధంతో పొడిచిన 51 గాయాలను గుర్తించారు.
ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన బూట్లు, ఖాళీ వాటర్ బాటిల్, బ్యాగులో కొత్త స్క్రూడ్రైవర్లు, నిందితుడి పేరు మీద ఉన్న విమానం, బస్సు టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్యాచారం.. జీవిత ఖైదు : బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేశాడని నిర్ధారించారు.
ఈ కేసును విచారించిన కోర్బా కోర్టు న్యాయమూర్తి జైదీప్ గార్గ్, నిందితుడిని దోషిగా తేల్చారు. హత్య, అత్యాచారం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నివారణ చట్టం కింద నిందితుడికి జీవిత ఖైదుతో పాటు, రూ.75,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో, మరో ఆరు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.


