Political Murder in Telangana : ఖమ్మం జిల్లాలో నెత్తుటి రాజకీయం పడగ విప్పింది. పచ్చని పల్లెటూరులో ప్రశాంతతకు భంగం కలిగింది. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు (Samineni Ramarao)ను దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో, మరో మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి జరగాల్సి ఉండగా జరిగిన ఈ దారుణం వెనుక ఉన్నది ఎవరు? ఇది కేవలం వ్యక్తిగత కక్షల పర్యవసానమా? లేక రాబోయే స్థానిక సమరంలో రాజకీయ ఆధిపత్యం కోసం పన్నిన పక్కా వ్యూహమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఖమ్మం జిల్లాను కుదిపేస్తున్నాయి.
ఘటనా స్థలం, జరిగిన తీరు: ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. రోజూలాగే వాకింగ్‌కు వెళ్లిన రామారావును ముగ్గురు వ్యక్తులు అడ్డగించి, పదునైన ఆయుధాలతో దాడి చేసి గొంతు కోసి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయాన్నే ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రామారావు నేపథ్యం, పలుకుబడి: సామినేని రామారావు సీపీఎం పార్టీలో కీలక నేతగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతుల సమస్యలపై గళమెత్తిన బలమైన నాయకుడు. పాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా, స్థానికంగా ఆయన మాటకు తిరుగులేదు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆయన మద్దతు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలదని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం స్పందన, పోలీసుల దర్యాప్తు: ఈ హత్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇలాంటి హత్యా రాజకీయాలకు తావులేదని, దోషులను వెంటాడి, వేటాడి చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. కేసు దర్యాప్తునకు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సైబర్ విభాగాల సహాయంతో నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. రామారావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
అనుమానాల వలయం..
రాజకీయ కోణం: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రామారావు పలుకుబడిని చూసి ఓర్వలేని రాజకీయ ప్రత్యర్థులే ఈ హత్య చేయించి ఉంటారని ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


